విదేశీ విద్యకే మొగ్గు

1 Oct, 2023 04:43 IST|Sakshi

దేశం దాటుతున్న భారతీయ విద్యార్థులు 

ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో 13 లక్షల మంది విద్యాభ్యాసం

ఒక్క 2022లోనే 7.5 లక్షల మంది విదేశీ బాట

ఈ ఏడాది ఇప్పటికే 3.37 లక్షల మంది పయనం

చదువు పూర్తయ్యాక స్వదేశానికి వచ్చేవారు తక్కువే

సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

అమెరికాకే మొదటి ప్రాధాన్యత..
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్‌) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్‌ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. 

రెండో స్థానంలో కెనడా..
భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్‌తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్‌ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌– సిటిజన్‌షిప్‌ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్‌ కోర్సుల్లో తక్కువ ట్యూషన్‌ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. 

వెనక్కి వచ్చేవారు తక్కువే..
ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు