రేటు పెంచితే వేటు.. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

30 Aug, 2021 02:33 IST|Sakshi
కృష్ణా జిల్లా కైకలూరులోని ఓ ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు

ఎమ్మార్పీకి మించి ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై కొరడా 

రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు 

రూ.2.09 కోట్ల విలువైన 810.61 టన్నుల ఎరువులు సీజ్‌.. రూ.6.92 కోట్ల విలువైన ఎరువుల అమ్మకం నిలిపివేత 

10 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు.. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరిపై క్రిమినల్‌ కేసు  

ఏడుగురు డీలర్ల లైసెన్స్‌లు సస్పెన్షన్‌.. కృష్ణా జిల్లాలో ఓ డీలర్‌ లైసెన్స్‌ రద్దు 

ఎమ్మార్పీకి మించి విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఎరువుల విషయంలో అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సమృద్ధిగా ఎరువులు ఉన్నప్పటికీ, కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీకి మించి విక్రయిస్తోన్న డీలర్లపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న దాడుల్లో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభం నుంచి ఎరువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను సీజ్‌ చేయడమే కాకుండా, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తోంది.

ఇప్పటి వరకు రూ.2.09 కోట్ల విలువైన 810.61 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు. ఫారమ్‌ ‘ఓ’లో పేర్కొన్న ఎరువులకు మించి నిల్వ చేసిన డీలర్లపై కేసులు నమోదు చేసి, వారి వద్ద ఉన్న రూ.6.92 కోట్ల విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, విజయనగరంలో ఒక డీలర్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేశారు. శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుల్లో విచారించే ఈ కేసుల్లో నేరారోపణ రుజువైతే సీజ్‌ చేసిన స్టాక్‌ విలువలో 25 నుంచి 100 శాతం వరకు జరిమానాలు విధించవచ్చు. తీవ్రతను బట్టి వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తారు. 

లైసెన్స్‌ లేకుండా డీఏపీ నిల్వలు
నోటిఫైడ్‌ లైసెన్స్‌లో లేని ఎరువులను విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని యాషువా ఎంటర్‌ ప్రైజెస్‌ యజమాని కొల్లూరి సురేష్‌తో పాటు విశాఖ జిల్లా నర్సీపట్నంలో లైసెన్సు లేకుండా 11.52 ఎంటీల ఐపీఎల్‌ కంపెనీకి చెందిన డీఏపీని నిల్వ చేసి, అనధికారికంగా విక్రయిస్తోన్న గొలుసు శ్రీనివాసరావుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. నాన్‌ నోటిఫైడ్‌ బయో ఫెర్టిలైజర్స్‌ను తెలంగాణలో విక్రయిస్తోన్న కృష్ణా జిల్లా గన్నవరంలోని దశరథ్‌ ఫెర్టిలైజర్స్‌ లైసెన్సును రద్దు చేశారు. 

ఎరువుల నిల్వలు ఇలా..
ఖరీఫ్‌ సీజన్‌లో 95.35 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 39.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 26 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. సీజన్‌ కోసం 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రారంభ నిల్వతో కలిపి రాష్ట్రంలో 18.04 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 9.94 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 8.10 లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆర్‌బీకేల ద్వారా రైతులకు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఇందుకోసం ఆర్‌బీకేల్లో 1,36,805 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 69,874 టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 66,931 టన్నుల ఎరువుల నిల్వలున్నాయి.

సీజన్‌ ముగిసే వరకు దాడులు 
ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయి. అయినా కొంత మంది డీలర్లు లైసెన్సుకు విరుద్ధంగా నిల్వ చేయడమే కాకుండా, ఎమ్మార్పీకి మించి, బిల్లుల్లేకుండా విక్రయిస్తున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం. సీజన్‌ ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయి. ధరలు పెరిగి పోతున్నాయంటూ కొంత మంది డీలర్ల సంఘ ప్రతినిధులు తప్పుడు ప్రకటనలు ఇస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటువంటి వారిపై కూడా క్రిమినల్‌ కేసులు పెడతాం.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు