కేరళకు ఆంధ్రా ధాన్యం 

18 Oct, 2022 06:00 IST|Sakshi

లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల 

బియ్యం అవసరమన్న కేరళ 

మంత్రి కారుమూరితో కేరళ మంత్రి భేటీ  

సాక్షి, అమరావతి: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది.

తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు.

ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్‌ అరుణ్‌కుమార్, డైరెక్టర్‌ విజయ సునీత, ఏపీ ఎస్‌సీఎస్‌సీఎల్‌ ఎండీ వీరపాండియన్, సహకార సంఘాల కమిషనర్‌ ఎ.బాబు పాల్గొన్నారు.  

టీడీపీ హయాంలో రూ.30 కోట్లు కొట్టేశారు
టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పౌర సరఫాల శాఖ నిధులు రూ. 30 కోట్లు కొల్లగొట్టారని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమికంగా ఐదుగురి తప్పు తేలడంతో వారిని సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు. నిందితుల ఆస్తులను అటాచ్‌ చేశామని, మొత్తం వసూలు చేస్తామన్నారు. తప్పుడు పత్రాలతో చెరువులు, కాలువలు, తోటలను వరి పొలాలుగా చూపి ఈ–క్రాపింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ధాన్యం నగదుతో పాటే రవాణా చార్జీలనూ రైతుల అకౌంట్‌లో వేస్తామన్నారు.

మరిన్ని వార్తలు