పడవెక్కి భద్రాద్రి పోదామా..!

20 Jan, 2021 09:04 IST|Sakshi

భద్రాద్రి రామయ్యను దర్శించాలంటే.. నల్లని నునుపైన తారురోడ్డు మీద.. బస్సులు, కార్లు, వ్యాన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ దూసుకుపోవడమే ప్రస్తుతం చాలామందికి తెలుసు. ఏదో వెళ్లాం వచ్చాం అన్నట్టే తప్ప.. ఇటువంటి ప్రయాణం పూర్తి ఆనందాన్నిస్తుందని చెప్పలేం. కానీ.. అదే ప్రయాణం– మంద్రంగా వీచే గాలి తరగలు తనువును సుతారంగా స్పృశిస్తుండగా.. గోదావరి అలల తూగుటుయ్యాలపై.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో అన్నట్టుగా.. కనులను కట్టిపడేసే ప్రకృతి అందాల నడుమ.. హాయిహాయిగా.. సాగితే.. ఆ అనుభూతి ఎప్పటికీ పదిలమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘పడవెక్కి భద్రాద్రి పోదామా.. భద్రాద్రి రాముడిని చూద్దామా..’ అని పాడుకుంటూ వెళ్లే ఆనంద క్షణాలు త్వరలోనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా గోదావరిపై జల రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  

సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచీపై ప్రయాణం అంటే ఎవ్వరికైనా ఆనందదాయకమే. చిన్నారులకు, కుర్రాళ్లకైతే మరీ ఉత్సాహం. కానీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లాంచీల్లో ప్రయాణమంటేనే వెనకడుగు వేయాల్సిన దుస్థితి. గతంలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో 58 మంది మృత్యువాత పడిన విషయం ఇంకా కన్నుల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదం తరువాత రాష్ట్ర ప్రభుత్వం నదిలో ప్రమాద రహిత ప్రయాణానికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు పర్యాటకానికి తెర పడుతుందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అటువంటి అనుమానాలకు తావు లేకుండా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ సంకల్పించింది. చదవండి: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త


ఇందులో భాగంగానే నాలుగు దశాబ్దాల కిందట ఆగిపోయిన జలరవాణాను పునరుద్ధరించే దిశగా చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జల రవాణాను ప్రోత్సహించేందుకు ‘సాగరమాల’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తోంది. అదే తరహాలోనే ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అఖండ గోదావరిపై జలరవాణా చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం – పోచవరం మధ్య జలరవాణాకు అనువైన పరిస్థితులపై బాథ్‌ మెట్రిక్‌ సర్వేకు ఇటీవల ఆదేశించింది. ఇందుకు రూ.45 లక్షలు కేటాయించింది. దీంతో రాజమహేంద్రవరం – భద్రాచలం మధ్య జల రవాణాకు మొదటి అడుగు పడినట్టయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలనుకునే వారు కూడా త్వరలో మళ్లీ గోదావరిపై లాంచీల్లో వెళ్లి వచ్చే అవకాశం కలగనుంది. 

తెల్లవారకుండానే ప్రయాణం 
అప్పట్లో భద్రాచలం వెళ్లే లాంచీ రాజమహేంద్రవరంలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరేది. దేవీపట్నం మండలం కొండమొదలుకు మధ్యాహ్నం 12 గంటలకు, అక్కడి నుంచి భద్రాచలానికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకునేది. ప్రారంభంలో రూపాయి, ఐదు రూపాయలు ఉండే చార్జీ జల రవాణా ముగిసిపోయే నాటికి రూ.100కు చేరింది. ఒక లాంచీలో ట్రిప్పునకు 70 నుంచి 80 మందిని తీసుకువెళ్లేవారు. అటు గోదావరిలో ప్రయాణం మాదిరే ఇటు ధవళేశ్వరం నుంచి కోనసీమలోని పంట కాలువల్లో కూడా లాంచీలు, పడవలపై ప్రయాణం సాగేది. అప్పట్లో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌ సరిహద్దు వరకూ మొత్తం అంతా గోదావరి పైనే రవాణా. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్‌) వరకూ మధ్యలో ఉన్న గిరిజన పల్లెలకు నిత్యావసర వస్తువులు, అటవీ ఉత్పత్తుల తరలింపునకు జల రవాణాయే ఆధారం. భద్రాచలం దాటిన తరువాత దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట పైనుంచి వెంకటాపురం వరకూ ఐదారు లాంచీలు తిరిగేవి.

రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకూ లాంచీ ప్రయాణం చేస్తే.. అక్కడి నుంచి ప్రైవేటు బస్సులలో ప్రయాణించేవారు. వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం నుంచి మహారాష్ట్ర వరకూ 10 లాంచీలు, రాజమహేంద్రవరం – ఛత్తీస్‌గఢ్‌లోని సాలాపూర్‌ మధ్య నాలుగు, పోలవరం, దేవీపట్నం, కొండమొదలు వరకూ రెండు లాంచీల చొప్పున నడిచేవి. భద్రాచలం సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి పడవల మీద వెదురు, పొగాకు, తునికాకు, పసుపు, మిర్చి వంటి సరకులు తరలింపు జల రవాణా పైనే జరిగేది. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లాంచీపై 25 టన్నుల వరకూ రవాణా చేసేవా రు. ఇందుకు బస్తాకు 75 పైసల నుంచి రూపాయి వరకూ తీసుకునేవారు. గోదావరిపై రాజమహేంద్రవరం వద్ద రోడ్‌ కం రైలు బ్రిడ్జి, శబరి నదిపై చింతూరు – చట్టి మధ్య, గోదావరిపై భద్రాచలం – సారపాక మధ్య వంతెనల నిర్మాణం జరిగిన జలరవాణాకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది.


1978కి ముందే..
రాజమహేంద్రవరం నుంచి పోచవరం వరకూ రోడ్డు మార్గంలో దూరం160 కిలోమీటర్లు. అదే గోదావరి జల మార్గంలో 100 కిలోమీటర్లు మాత్రమే. అంటే 60 కిలోమీటర్లు తక్కువ. గతంలో రోడ్డు సౌకర్యం లేనప్పుడు గోదావరి జిల్లాల్లోని 100 గ్రామాలకు జల రవాణాయే దిక్కు. 1978కి ముందే గోదావరిలో జల రవాణా ఉంది. రాజమహేంద్రవరం నుంచి కూనవరం, భద్రాచలం, కుంట వరకూ ప్రతి రోజూ 80 నుంచి 100 లాంచీలపై ప్రజల రాకపోకలకు, నిత్యావసరాల తరలింపునకు జల రవాణా తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. మారేడుమిల్లి రోడ్డు నిర్మించిన తరువాత ఆ మార్గంలో కలప, వెదురు రవాణా మాత్రమే జరిగేవి. 1986లో తారు రోడ్డు వేశాక రాజమహేంద్రవరం నుంచి బస్సు సర్వీసు ఏర్పాటుతో లాంచీ ప్రయాణాలు తగ్గాయి. అలా 80వ దశకం వరకూ జల రవాణా సాగింది.

పూడికలు తెలుసుకునేందుకు.
నీటి లోపలి స్వరూపాన్ని అంచనా వేసేందుకు, ఇసుక, పూడిక ఎంతవరకూ ఉన్నయో తెలుసుకునేందుకు బాథ్‌ మెట్రిక్‌ సర్వే నిర్వహిస్తాం. ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందనే విషయాలు కూడా సర్వే ద్వారా తెలుస్తాయి. దీనివలన పడవల రాకపోకలకు ఏ మేరకు అనువుగా ఉందో అంచనా వేయవచ్చు. జల రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ సర్వే సహాయ పడుతుంది. 
– ఆర్‌.మోహనరావు, హెడ్‌వర్క్స్‌ ఈఈ, ధవళేశ్వరం

లాంచీ ఓనర్‌ అంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం 
1983లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. అప్పట్లో నాకు 16 సంవత్సరాలు. ఇప్పుడు 55 సంవత్సరాలు. జల రవాణాను మూడు దశాబ్దాలు చూశాను. లాంచీ ఓనర్‌ అంటే మండల ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్‌లా ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ ఉండేది. ప్రయాణికుడికి రూపాయి నుంచి రూ.100 చార్జీ వరకూ నేను చూశాను. తక్కువ చార్జీ చేసినప్పటికీ ప్రయాణంలో ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్లం. అప్పట్లో తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఆ శాటిస్‌ఫేక్షన్‌ వేరుగా ఉండేది. ఇప్పుడు వేలు ఆర్జిస్తున్నా ఆ రోజుల్లో ఉన్న శాటిస్‌ఫేక్షన్‌ లేదు. 
– పాదం వెంకట రమణమూర్తి (బుల్లు), లాంచీల యజమాని, పట్టిసీమ

మరిన్ని వార్తలు