గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు

22 Jul, 2021 03:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

త్వరలోనే ఏపీలో గ్రామ ఉజాలా పథకాన్ని ప్రారంభిస్తాం

కేంద్రం రూ.450 కోట్లు వెచ్చించే చాన్స్‌

సీఈఎస్‌ఎల్‌ ఎండీ మహువా ఆచార్య వెల్లడి

మంత్రి పెద్దిరెడ్డితో భేటీ.. ఈ కార్యక్రమం అమలుపై చర్చ

సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్‌ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) ఈ ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్‌ఎల్‌ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు.

రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్‌ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.

అమలు ఎలా? 
► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్‌ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. 
► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్‌ఈడీ బల్బులను అందజేస్తారు. 
► బహిరంగ మార్కెట్‌లో 7 వాట్‌ ఎల్‌ఈడీ బల్బు రూ.70, 12 వాట్‌ ఎల్‌ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. 

లాభం ఇలా.. 
పథకం అమలుతో  ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్‌ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్‌ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఏస్‌ఈసీఎం) అధికారులు వెల్లడించారు.  ఇదే సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు