బంగాళాఖాతంలో అల్పపీడనం

21 Oct, 2022 08:25 IST|Sakshi

రేపు వాయుగుండంగా మార్పు

24న తుపానుగా బలపడే అవకాశం

ఆపై పశ్చిమ బెంగాల్‌ వైపు పయనం

రాష్ట్రంలో తేలికపాటి వానలే

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారానికి వాయుగుండంగా, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆపై ఉత్తరం వైపుగా దిశ మార్చుకుని తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  24న తుపానుగా బలపడనుంది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటి 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది.

ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని వివరించింది. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, యానాం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నర్సీపట్నం (అనకాపల్లి)లో 4.9 సెంటీమీటర్లు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు)లో 2.8, ముండ్లమూరు (ప్రకాశం)లో 2.8, ఆళ్లగడ్డ (నంద్యాల)లో 2.6, తొండూరు (వైఎస్సార్‌)లో 2.6, ఆస్పరి (కర్నూలు)లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు