వైఎస్సార్‌ కడపలో ‘మను’ పాలిటెక్నిక్‌ కళాశాల

5 Jul, 2021 10:53 IST|Sakshi

నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలోపాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ  

దేశంలోనే ఐదోది

పదిలో ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివిన వారికి అవకాశం  

మూడు బ్రాంచుల్లోప్రతి ఏటా 180 సీట్లు కేటాయింపు 

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం  

కడప ఎడ్యుకేషన్‌: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్‌ కళాశాల జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఉంది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరానికి ఆడ్మిషన్లు జరగనున్నాయి.

ఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్‌ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సీటీ గ్రాంట్‌ కమిషన్, మినిస్ట్రియల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. రూ. 5 కోట్లతో మౌలిక సదుపాయాలు, కళాశాల ఆవరణ మొత్తం ప్రహారీని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేషనల్‌ ఉర్దూ యూనివర్సీటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్భంగా, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి.  

ఏ కోర్సులు ఉన్నాయంటే.. 
మను పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి. ఇందులో డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 180 సీట్లు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 17 మంది (ఎన్‌ఐటీ, ఐఐటీకి చెందిన హెచ్‌ఓడీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ) టీచింగ్, 10 మంది నాన్‌ టిచింగ్‌ సిబ్బంది ఉన్నారు.

విద్యార్థులకు కంప్యూటర్‌ ల్యాబ్, సెంట్రల్‌ లైబ్రరీ, అన్ని కోర్సులకు సంబంధించి వర్కుషాపులు ఉన్నాయి. వివిధ రకాల ఆటలు అడుకునేందుకు సువిశాలమైన ఆటస్థలం, క్రీడా పరికరాలు కూడా ఉన్నాయి. యూనివర్సీటీ నుంచి ఎవరైనా ప్రతినిధులు కళాశాల సందర్శనకు వస్తే వారు ఉండేందుకు వీలుగా గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు.  

కళాశాలలో ప్రవేశానికి అర్హులెవరంటే... 
మను పాలిటెక్నిక్‌ కళాశాలలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చేరవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఏ కేటగిరికి చెందిన వారైనా పదో తరగతిలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలలో చదువుతున్నా లాంగ్వేజీకి సంబంధించి మాత్రం ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివే వారికి ఇందులో ప్రవేశానికి అర్హులు. ఇందులో చేరాలనుకునే వారు కచ్చితంగా ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు సాధించాలి. ర్యాంకులు సాధించిన వారికి కేటగిరీల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండీక్యాప్, ఉమెన్‌ కోటా) వారీగా రోస్టర్‌ కమ్‌ మెరిట్‌ ప్రకారం సీట్లను కేటాయిస్తారు.

ఇందులో చేరే వారిలో అమ్మాయిలు ఏడాదికి రూ. 900, అబ్బాయిలు రూ. 2,350 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్, నేషనల్‌ స్కాలర్‌షిప్‌ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే జరుగుతున్నాయి.  

జులై 12 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
మను పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి జులై 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష జులై 30వ తేదీన జరుగుతుంది. కడప సమీపంలోని రిమ్స్‌ వద్ద నూతనంగా నిర్మించిన మను పాలిటెక్నిక్‌ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రవేశ పరీక్షకు అమ్మాయిలు రూ. 350, అబ్బాయిలు రూ. 550 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను బట్టి రోస్టర్‌ కమ్‌ మెరిట్‌ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.  

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
కడపలో ఏర్పాటు చేసిన మను పాలిటెక్నిక్‌ కళాశాలను జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ కళాశాలలో డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఈ మూడు కోర్సులకు సంబంధించి 180 సీట్లు ఉన్నాయి.

ఈ కోర్సులకు 6 సెమిష్టర్స్‌ పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. ఇందులో 5 సెమిస్టర్స్‌కు పరీక్షలు జరుగుతాయి. 6వ సెమిస్టర్‌లో మాత్రం ఇండ్రస్టియల్‌ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో విద్యార్థులకు స్టైఫండ్‌ కూడా వస్తుంది. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. మూడో సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం.
– డాక్టర్‌ ఎండీ ఆబ్దుల్‌ ముక్సిత్‌ఖాన్, ప్రిన్సిపాల్, మను పాలిటెక్నిక్‌ కళాశాల, కడప

మరిన్ని వార్తలు