వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యం

27 Jun, 2022 02:04 IST|Sakshi
ఉపఎన్నికలో గెలుపొందిన అనంతరం అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

82,888 ఓట్ల మెజార్టీ దక్కించుకున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి 

ప్రతి రౌండులో ఆధిక్యత.. మొత్తంగా 74.47 శాతం ఓట్లు  

2019 ఎన్నికలప్పటి కంటే 21.25 శాతం ఓట్లు అధికం

ఫ్యాన్‌ స్పీడ్‌కు కమలం గల్లంతు.. డిపాజిట్‌ దక్కని బీజేపీ

టీడీపీ లోపాయికారి ఒప్పందానికి చెంపపెట్టు

పోలింగ్‌ ఏజెంట్ల అవతారంతో విఫలయత్నం

గౌతమన్న పేరు నిలబెడతా: మేకపాటి విక్రమ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్‌ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌ నుంచి 20వ రౌండ్‌ వరకు ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యత సాధించారు.

సరాసరి ప్రతి రౌండ్‌లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో సైతం వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్‌ బ్యాలెట్లలో వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి.  

ఫ్యాన్‌ గాలికి బీజేపీ గల్లంతు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్‌సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు.
బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్‌ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్‌ చేతుల మీదుగా డిక్లరేషన్‌ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి 

అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్‌ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్‌ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్‌ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్‌కు వెళితే వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు.

మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్‌ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్‌సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్‌ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. 

గౌతమ్‌ అన్న పేరు నిలబెడతా
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్‌ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ధన్యవాదాలు.    
– మేకపాటి విక్రమ్‌రెడ్డి,  ఎమ్మెల్యే, ఆత్మకూరు 

మరిన్ని వార్తలు