శీతాకాల అతిథులొచ్చేశాయ్‌!

29 Aug, 2021 05:07 IST|Sakshi

ఏపీలో వలస పక్షుల సందడి 

పాడేరులో కనిపించిన చిన్న బూడిద రంగు పక్షుల జంట

ఏటా హిమాలయాల నుంచి రాక

వచ్చిన ప్రదేశానికే మరుసటి ఏడాది మళ్లీ రావడం వీటి ప్రత్యేకత

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి శీతాకాల వలస పక్షుల రాక మొదలైంది. గ్రే వాగ్‌టైల్‌ (బూడిద రంగు జిట్టంగి) పక్షుల జత ఈ నెల 24న విశాఖ మన్యంలోని పాడేరు సమీపంలో కనువిందు చేశాయి. ఐఐఎస్‌ఈఆర్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) బృందం వీటిని రికార్డు చేసింది. గ్రే వాగ్‌టైల్‌ పక్షులు శీతాకాలంలో ఏపీ అంతటా విస్తృతంగా కనిపిస్తాయి. ఈ పక్షులు ప్రధానంగా కీటకాలను తింటాయి. 18–19 సెంటీమీటర్ల పొడవు, 20 గ్రాముల బరువున్న ఈ పక్షులను ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు. ఈ పక్షులు తోకను పైకి కిందకు కదిలిస్తుంటాయి. ఇవి ప్రతి ఏడాదీ వేసవిలో హిమాలయాలు, ఇంకా ఎత్తయిన ప్రాంతాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత భారత్‌లో దక్షిణ ప్రాంతాలకు వలస వెళతాయి. అలా మన రాష్ట్రంలోకి పెద్ద సంఖ్యలో వస్తాయి. 

పంటలపై కీటకాలను తింటాయి..
పంటలపై ఉండే కీటకాలను ఎక్కువగా తినడం ద్వారా మన పర్యావరణ వ్యవస్థకు ఈ పక్షులు ఎంతో దోహదం చేస్తాయి. వీటికి అద్భుతమైన నావిగేషన్‌ (ప్రయాణ మార్గం) నైపుణ్యం ఉంటుంది. ఇవి శీతాకాలంలో ఒక ప్రదేశాన్ని సందర్శించిన తరువాత మరుసటి ఏడాది అదే ప్రదేశానికి వస్తుంటాయి. భారత్‌ వెలుపల మంగోలియా, సైబీరియా, రష్యా, చైనాలో ఈ పక్షులు సంతానోత్పత్తి చేస్తాయి. సెప్టెంబర్‌ నుంచి మార్చి వరకు రాష్ట్రంలో ఇక్కడ గడిపి మళ్లీ సంతానోత్పత్తి కోసం హిమాలయాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఇవి వెళ్లిపోతాయి. శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం తర్వాత ఈ పక్షులు తమ ఇంటికి లక్ష్మీదేవిలా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. తమిళనాడులోని వల్పరై హిల్‌ స్టేషన్‌ వాసులు ఈ పక్షుల రాకను వేడుకలా జరుపుతారు.

150 జాతుల వలస పక్షులు
ప్రతి ఏడాది శీతాకాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఖండాల నుండి 150 కంటే ఎక్కువ జాతుల వలస పక్షులు ఏపీని సందర్శిస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాలు, యూరప్, రష్యా, చైనా, సైబీరియా, ఆర్కిటిక్, అట్లాంటిక్‌ నుండి ఇవి వస్తాయి. ఆగస్ట్, సెప్టెంబర్‌ చివరి నుంచి వీటి ఆగమనం ప్రారంభమవుతుంది. ఈ పక్షుల తరువాత వార్బ్లర్స్‌ (పాటల పిట్టలు), థ్రష్‌లు (గంటెపిట్టలు), ఫ్లై క్యాచర్లు (ఈగపట్టు పిట్టలు), హరియర్స్‌ (గద్దలు), కెస్ట్రెల్స్‌ (డేగల్స్‌) వంటి పెద్ద పక్షులు చిత్తడినేలలు, సాగు భూములకు వచ్చి ఎక్కువగా ఎలుకలను తింటుంటాయి.
– బండి రాజశేఖర్, సిటిజన్‌ సైంటిస్ట్, ఐఐఎస్‌ఈఆర్, తిరుపతి  

మరిన్ని వార్తలు