‘డ్రామా నాయుడి మాటలు నమ్మొద్దు’

6 Sep, 2020 19:09 IST|Sakshi

మంత్రి పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: డ్రైనేజీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరుకి తేడా లేదని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం’పై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్‌ ఉచిత విద్యుత్ ఇస్తానంటే అవహేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే రైతుల్ని పిట్టల్లా కాల్చారు. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు మనస్తత్వం. ఇప్పుడు రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారు. వయసు పైబడి ఆయనకు మతిమరుపు వచ్చింది. చంద్రబాబు, లోకేష్‌ల అబద్ధాలకు అంతేలేకుండా పోయిందని’’  మంత్రి పేర్నినాని మండిపడ్డారు. (చదవండి: దటీజ్‌ మంత్రి పేర్ని నాని!

‘‘సున్నా వడ్డీ కింద 1,053 కోట్ల రూపాయలను సీఎం జగన్ మంజూరు చేశారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌ బంగ్లాలో దాక్కున్నారు. రూ.970 కోట్ల ధాన్యం బకాయిలను చంద్రబాబు చెల్లించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే రైతుల బకాయిలు చెల్లించాం. సివిల్ సప్లయర్స్‌ కార్పొరేషన్‌ తాకట్టు పెట్టి రూ.2 వేల కోట్ల పప్పు-బెల్లం పంచారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు జరిగితే లోకేష్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అడ్డుకున్నది చంద్రబాబు కాదా?. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర చేస్తున్నారని’’ ధ్వజమెత్తారు. (చదవండి: విజయవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ)

డిస్కం కంపెనీలకు రూ.8 వేల కోట్లు బకాయిలు పెడితే సీఎం జగన్ చెల్లించారని, తన పాలనలో రైతులను చంద్రబాబు విస్మరించారని తెలిపారు. టీడీపీ నేతలు ఇక నైనా డ్రామాలు ఆపాలని, వ్యక్తిగత దూషణల సంస్కృతి టీడీపీ నేతలదేనని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పథకంపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తుందన్నారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ ఆగదని ఆయన స్పష్టం చేశారు. ‘‘580 కోట్లు విత్తన సబ్సిడీ ఎగ్గొట్టిన చరిత్ర మీది. పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం మాది. డ్రామా నాయుడు మాటలను నమ్మొద్దని’’ ప్రజలకు మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు