విద్యార్థినుల మిస్సింగ్‌ కేసు..లుక్‌ అవుట్‌ నోటీసు జారీ 

11 May, 2022 14:19 IST|Sakshi

కరపత్రాల పంపిణీ 

ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వండి

చంద్రగిరి : హాస్టల్‌ నుంచి పారిపోయిన విద్యార్థినుల ఆచూకీ కోసం చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. చంద్రగిరి సమీపంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ, సంప్రదాయ పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న నలుగురు విద్యార్థినులు సోమవారం రాత్రి హాస్టల్‌ గోడ దూకి పారిపోయిన సంగతి తెలిసిందే. వీరి కోసం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో దరాప్తును ముమ్మరం చేశారు. 

విద్యార్థినుల సొంత జిల్లాలైన కడప, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నంకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థినుల ఆచూకీ కోసం లుక్‌అవుట్‌ నోటీసు జారీచేసి అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఆయా జిల్లాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో కరపత్రాలు సైతం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థినుల ఆచూకీ తెలిసిన వారు తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ 9440796747, చంద్రగిరి సీఐ 9440796760 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రణతి ఓ మొబైల్‌ నుంచి ప్రొద్టుటూరులోని తన స్నేహితురాలికి ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మెస్సేజ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు