Punganur Cattle: వెయ్యేళ్ల నాటి ఆవుకు వెయ్యికోట్లు

30 Jul, 2021 12:56 IST|Sakshi
పుంగనూరు రకం పొట్టి జాతి పశువులు

పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికి శ్రీకారం

కడప, పలమనేరులో పునరుత్పత్తి కేంద్రాలు 

ఈ ఆవుల కోసం యుద్ధాలు జరిగాయి.. శాసనాలు కీర్తించాయి. కరువు రక్కసిని తట్టుకున్నాయి. ఔషధ పాలను అందించాయి. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే కాలక్రమేణా అంతరించిపోయాయి. మందల నుంచి వందల్లోకి చేరాయి. ఈ క్రమంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. వెయ్యేళ్ల నాటి ఆవు కోసం వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది.

పుంగనూరు: దేశవాళీ ఆవుల్లోనే విశిష్టమైన పుంగనూరు జాతి అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆవుల పరిశోధనలు, ఉత్పత్తికి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. కడపలో ఈ ఆవుల అభివృద్ధి, పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు గత ఏడాది రూ.70 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పుంగనూరు జాతి పశువులు 241 వరకు ఉన్నట్లు సమాచారం. పలమనేరు క్యాటిల్‌ఫామ్‌లో 221 ఉండగా, అనంతపురం జిల్లా కూడేరులో పాడి రైతు కృష్ణమూర్తి వద్ద 20 ఉన్నాయి. వీటిని సంరక్షిస్తూ పునరుత్పత్తిని పెంచడానికి అవసరమైన పరిశోధనలు జరిపేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 


పుంగనూరు జాతి అభివృద్ధే లక్ష్యం 

పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్‌ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం ఏర్పడింది. ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్‌ కాన్జర్వేషన్‌(స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. గతంలో పుంగనూరు పొట్టి రకం ఆవులు పుంగనూరు, పలమనేరు, మదనపల్లెల్లో పుట్టి వృద్ధి చెందేవి. అప్పట్లో పుంగనూరు సంస్థానాధీసులు వీటిని పిఠాపురం, కాకినాడ సంస్థానాధీసులకు బహుమానంగా అందజేయడంతో ఆ ప్రాంతంలోనూ ఇవి కొంతవరకు ఉన్నట్లు తెలుస్తోంది.  

అంతరించిపోతున్న అరుదైన జాతులు  
దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 350 దాకా ఉండగా, అందులో 221 వరకు పలమనేరులోని పశు పరిశోధనా కేంద్రంలోనే ఉన్నాయి. అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవులు (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. అధిక పాలనిచ్చే షాహీవాల్‌ రకం కూడా కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్‌లోని మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి.  


తగ్గుతున్న ఉత్పత్తి 

పదిహేడేళ్ల క్రితం 20 పొట్టి రకం ఆవులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అనుకున్నంతగా ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంకరణం చెందడంతో ఉత్పత్తి అయ్యే దూడలు ఆరోగ్యంతో జన్మిస్తున్నాయి. జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కోడెల ద్వారా ఉత్పత్తి అయ్యే దూడలు బలహీనంగా పుట్టి మృతిచెందుతున్నాయి.  

పిండమార్పిడి పద్ధతి ద్వారా..  
పరిశోధనా కేంద్రంలో ప్రభుత్వం రూ.1.18 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రో ట్రాన్స్‌ఫర్‌ ల్యాబ్‌) నెలకొల్పింది. దీని ద్వారా ఎదకొచ్చిన ఆవుకు పుంగనూరు జాతి సెమన్‌ను ఇచ్చి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భాధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగు చేసి సరోగసి పద్ధతిలో ఇతర ఆవులకు ఇంప్లాంట్‌ చేస్తారు. ఇక్కడి నుంచి ఈ జాతి వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్‌లోని యన్‌.బి.ఏ.జి.ఆర్‌ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరుస్తున్నారు. 


పుంగనూరు జాతి చరిత్ర 

క్రీస్తుశకం 610 సంవత్సరంలో పుంగనూరు జాతి ఆవులను గుర్తించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణాపద దేశంలోని పుంగనూరు ప్రాంతంలో పొట్టి ఆవులను కనుగొన్నారు. బాణులు, నోళంబులు, వైదంబచోళ ప్రభువులు పుంగనూరు ఆవులను తమ సంస్థానాల్లో పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకున్న అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవుల అభివృద్ధి సాగింది. మందలు మందలుగా ఉండే ఈ ఆవుల కోసం యుద్ధాలు చేసేవారు. విజేతలు విజయచిహ్నంగా ఆవుల మందలను తీసుకెళ్లినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.  

ప్రత్యేకతలు 
పుంగనూరు జాతి ఆవులు దేశంలోనే మరెక్కడా కనిపించవు. సాధారణ ఆవు పాల ధరకంటే ఈ ఆవుపాలకు రెట్టింపు గిరాకీ ఉంది. తెలుపు, నలుపు ఆవుల పాలు, పెరుగు, నెయ్యికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాలలో అత్యధికంగా ఔషధ గుణాలున్నట్లు బయోడైవర్సిటీ ప్రకటించింది. పుంగనూరు ఆవుల చరిత్ర, విశిష్టతపై మద్రాస్‌ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. కెఎస్‌ఎస్‌.శేషన్‌ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్‌ రోల్‌ ఇన్‌ రూరల్‌ ఎకానమిలో పుంగనూరు జాతి సంరక్షణకు జమీందారులు చేపట్టిన చర్యలు విశదీకరించారు. మహాబలి బాణరాజు విక్రమాదిత్య కాలంలో నోళంబులు దాడులు చేసి ఆవుల మందలను తోలుకెళ్లినట్లు బూడిదపల్లె, కురిజల, మినికి, మేటిమంద, కరకమంద, ఈడిగపల్లె, సోమల, రామసముద్రం గ్రామాల్లోని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీరామారావు పుంగనూరు ఆవులను పోషించుకునేవారు. 


విశిష్టతలు 

► పశువు 70 నుంచి 90 సెంటిమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. 
► ఈ ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉండి, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. 
► ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువుంటాయి. 
► రోజుకు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. 
► 2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తుంది. 
► ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. 
► లేత చర్మము, చిన్న పొదుగు, చిన్నతోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. 
► ఈ ఆవుల ధర లక్ష నుంచి ఇరవై లక్షల వరకు పలుకుతుంది. 

పూర్వవైభవం దిశగా చర్యలు
కనుమరుగవుతున్న పుంగనూరు జాతి పాడి ఆవులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేశాం. అతి తక్కువ ధరకు లభించే ఈ ఆవులను ఇప్పుడు లక్షలాది రూపాయలతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాజా పరిస్థితిపై సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నివేదికలు అందజేశాం. ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చొరవ చూపని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు ఆవుల పునరుత్పత్తికి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అభినందనీయం. ఈ ప్రాంతం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. 
– డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

మంచి పరిణామం 
పుంగనూరు జాతి ఆవులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. నా చిన్నప్పుడు పుంగనూరు, పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోను రెండు, మూడు ఆవులు ఉండేవి. ప్రస్తుతం అవి వెదికినా కనిపించడం లేదు. నూరు రూపాయలకు లభించే ఆవు ఇప్పుడు రెండు లక్షల ధర పలుకుతోంది. ఈ జాతికి కోడెదూడలు పుడుతుండడంతో పునరుత్పత్తి బాగా తగ్గిపోయింది. 
– ఖాదర్‌ఖాన్, ఆవుల వ్యాపారి, పుంగనూరు

మరింత అభివృద్ధి 
ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 221 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎల్‌డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. అరుదైన పుంగనూరు పొట్టి రకం జాతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది.   
– గంగరాజు, సీనియర్‌ సైంటిస్ట్, పలమనేరు  

సంరక్షణ సులభం 
పుంగనూరు ఆవులను డార్వ్స్‌కౌస్‌ అంటారు. ప్రపంచ దేశాలలో అతిపొట్టి రకమైన పుంగనూరు ఆవులో వ్యాధి నిరోధక శక్తి అధికం. ఇంగ్లండ్‌లోని డెస్టర్‌కౌ 90 సెంటిమీటర్ల ఎత్తు ఉంటుంది. పుంగనూరు ఆవులు 70 నుంచి 80 సెంటిమీటర్లు ఎత్తు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్‌ డస్టర్‌కౌకు ఇవ్వడం సమంజసం కాదు. జమీందారులకు ప్రీతిపాత్రమైన పుంగనూరు జాతి ఆవుల మేత కోసం నియోజకవర్గంలోని ఆవులపల్లెలో కొన్నివేల ఎకరాలను కేటాయించిన చరిత్ర ఉంది.  
– కెఎస్‌ఎస్‌.శేషన్, విశ్రాంత ప్రొఫెసర్, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

మరిన్ని వార్తలు