తృణధాన్యాలతో మధుమేహానికి చెక్‌!

30 Jul, 2021 08:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహంతో బాధపడుతున్న వారికి శుభవార్త. కొర్రలు, జొన్నలు, రాగుల వంటి తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే టైప్‌–2 మధుమేహాన్ని నియంత్రించొచ్చని ఇక్రిశాట్‌ (మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం)తో పాటు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. మధుమేహం బారినపడని వారికి కూడా ప్రయోజనమేనని 11 దేశాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనంలో తేలింది. ఫ్రాంటీయర్స్‌ ఇన్‌ న్యూట్రీషన్‌ జర్నల్‌ సంచికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.

15 శాతం తగ్గుదల: తృణ ధాన్యాలను ఆహారం గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ శాతం 12 నుంచి 15 శాతం వరకు (భోజనానికి ముందు, తర్వాత) తగ్గుతుందని తెలి సింది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు డయాబెటిస్‌ వచ్చినప్పటి కంటే రాకముందు  స్థాయికి తగ్గిపోయినట్టు గుర్తించారు. ప్రీ డయాబెటిక్‌లో ఉన్నవారి హెచ్‌బీఏ1 సీ (హీమోగ్లోబిన్‌కు అతుక్కున్న గ్లూకోజ్‌) మోతాదుల్లోనూ  17 శాతం తగ్గుదల నమోదైందని చెబుతున్నారు. 

80 అధ్యయనాల సారాంశం: మధుమేహంపై తృణధాన్యాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రచురితమైన 80 అధ్యయనాలను పరిశీలించారు. ‘తృణధాన్యాల ప్రభావం మధుమేహంపై ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరూ శాస్త్రీయంగా పరి శోధించలేదు. ఈ నేపథ్యంలో పద్ధ తి ప్రకారం అన్ని అధ్యయనాలను సమీక్షించాలని తాజాగా ఈ ప్రయత్నం చేశాం’అని ఇక్రిశాట్‌ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఎస్‌.అనిత తెలిపారు.

తృణధాన్యాలే పరిష్కారం  
‘అనారోగ్యం, పోషకాల లోపం వంటి సమ స్యలకు తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడమే పరిష్కారం. ఆహారం ద్వారా మరిన్ని పోషకాలు అందించేందుకు పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. స్మార్ట్‌ఫుడ్‌ పేరుతో ఇక్రిశాట్‌ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ అధ్యయ నాన్ని నిర్వహించాం. మధుమేహం మాత్రమే కాకుండా.. రక్తహీనత,  కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కాల్షియం లోపాల వంటి అనేక సమస్యలకు తృణధాన్యాలకు ఉన్న సంబంధాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తాం’ 
–జాక్వెలిన్‌ హ్యూగ్స్, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌  

మరిన్ని వార్తలు