పొట్టి దూడ.. గట్టి మేలు!

21 Oct, 2023 01:41 IST|Sakshi

పుంగనూరు రకానికి డిమాండ్‌ అధికం

ఆసక్తి చూపుతున్న పక్క రాష్ట్రాలు

జల్లెడ పడుతున్న దళారులు

ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి మేలని నమ్మకం

పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్‌ ఉన్నట్టే. వీటిలో మొదటి­రకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు.

ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. 

ఔషధ గుణాలు మెండు
అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది.  అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి.  వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. 

పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి...
1953లో పలమనేరు కెటిల్‌ఫామ్‌ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్‌సైటీవ్‌ కన్సర్వేషన్‌ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగ­నూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద  పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్‌లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. 

గణనీయ ఉత్పత్తికి కృషి
ఆంధ్రప్రదేశ్‌ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్‌డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్‌ఫామ్‌లో సెమన్‌ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు

మరిన్ని వార్తలు