ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌ సీపీ

27 Feb, 2021 12:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పుర ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ దూసుకుపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జోరు ముమ్మరంగా సాగుతోంది. శనివారం.. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు పాల్గొన్నారు. ఉదయం విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 8, 54వ వార్డుల్లో విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీలో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

54వ వార్డులో స్థానిక సమస్యలను ప్రజలు.. విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారని ఆయన తెలిపారు. సాయినగర్‌లో తారురోడ్డు వేయిస్తామన్నారు. జ్యోతినగర్‌లో అంగన్‌వాడీ కేంద్రంతో పాటు, రెడ్డినగర్‌లో సామాజిక భవనం, గజపతి నగర్‌లో మీటింగ్‌ హాల్‌ నిర్మిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 8 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శివనగర్‌లో కమ్యూనిటీ హాల్‌, దోబీ ఘాట్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

టీడీపీ హయాంలో అంతా దోపిడీయే: మంత్రి వెల్లంపల్లి
కృష్ణా జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో అంతా దోపిడీయేనని, జన్మభూమి కమిటీల పేరుతో సొంతవాళ్లకే పథకాలు కట్టాబెట్టారని మండిపడ్డారు. అభివృద్ధిని పూర్తి నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో జగనన్న పథకం లేని ఇల్లు లేదు. రూ.600 కోట్లతో విజయవాడను అభివృద్ధి చేస్తున్నాం. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయవాడను నిర్లక్ష్యం చేశాయి. ఇప్పడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. జగన్‌ దెబ్బకు చంద్రబాబు కుప్పం పరుగెత్తాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెమ్మంటున్నారు కానీ లోకేష్‌ను తెమ్మనడం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. గతంలో చంద్రబాబుతో పాపాల్లో పవన్‌కు పాత్ర లేదా?. చంద్రబాబుకు మతి భ్రమించింది, ఆయనో జోకర్‌. చంద్రబాబు మ్యానిఫెస్టో ద్వారా ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడు. ఆయన మ్యానిఫెస్టో ఒక చిత్తు కాగితం’’ అంటూ మంత్రి వెల్లంపల్లి విమర్శలు గుప్పించారు.

విప్లవాత్మక పాలనకు సీఎం జగన్‌ నాంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు..
సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మ్యానిఫెస్టో, నవరత్నాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారని పేర్కొన్నారు. విప్లవాత్మక పాలనకు ఆయన నాంది పలికారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను లోకేష్‌ విడుదల చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 600 హామీలతో ఇచ్చిన మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టిందని దుయ్యబట్టారు.‘‘అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ చేసిన వేలకోట్ల అవినీతిని అసెంబ్లీ సాక్షిగా వివరించాం. టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ 12 వేలమంది వద్ద డబ్బు వసూలు చేసి మోసం చేసింది. పన్నులు పెంచింది టీడీపీ హయాంలో కాదా?.ఇప్పుడు ఎన్నికల కోసం టీడీపీ బూటకపు హామీలు ఇస్తోందని’’ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.
చదవండి:
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు 
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్‌!

 

మరిన్ని వార్తలు