ఆదర్శనీయం వంగపండు జీవితం

5 Aug, 2021 04:21 IST|Sakshi
వంగపండు స్మారక అవార్డుతో బాడ సూరన్నను సత్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, మేయర్‌ హరివెంకట కుమారి, నటుడు ఆర్‌.నారాయణమూర్తి, ప్రజా కవి గద్దర్, ఎమ్మెల్యేలు, వంగపండు కుటుంబ సభ్యులు

ప్రథమ వర్ధంతి సభలో వక్తలు 

బాడ సూరన్నకు వంగపండు స్మారక అవార్డు

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు జీవితం ఎందరికో ఆదర్శనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో బుధవారం వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..సాంస్కృతిక, కళా రంగానికి వంగపండు జీవితం అంకితం చేశారని చెప్పారు. ప్రజాకవి గుమ్మడి విట్టల్‌రావు (గద్దర్‌) మాట్లాడుతూ..కళాకారులంతా వంగపండు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. వంగపండుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని గౌరవం కల్పించిందన్నారు. ఆయన చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని గుర్తుచేశారు. బీచ్‌రోడ్డులో వంగపండు విగ్రహం ఏర్పాటుకు చర్యలు, ఏటా ఆయన పేరిట ఓ కళాకారుడికి రూ.2 లక్షల నగదు అవార్డు ప్రదానం చేయడం మంచి నిర్ణయమన్నారు. కళాకారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో గౌరవం ఇస్తున్నారంటూ సభాముఖంగా సెల్యూట్‌ చేశారు. గద్దర్, ఆర్‌.నారాయణమూర్తి, విమలక్క తదితరులు తమ ఆటపాటలతో అలరించారు. 

బాడ సూరన్నకు అవార్డు ప్రదానం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్నకు జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం తరఫున అందించారు. బాడ సూరన్న మాట్లాడుతూ..తన 36 ఏళ్ల జీవితంలో కళను, కళాకారుడిని ఇంతలా గౌరవించిన ప్రభుత్వం మరొకటి చూడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైరపర్సన్‌ వంగపండు ఉష,  వీఎంఆర్‌డీఏ చైరపర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్, రాష్ట్ర విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్‌ మళ్ల విజయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు