Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు

6 Nov, 2023 05:05 IST|Sakshi
ఇజ్రాయెల్‌ దాడుల్లో ధ్వంసమైన మఘాజి శరణార్థి శిబిరం శిథిలాల్లో బాధితుల కోసం పాలస్తీనియన్ల అన్వేషణ

గాజాలో నిప్పుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ సైన్యం  

మూడు శిబిరాలపై దాడులు 

24 గంటల్లో 73 మంది మృతి  

గాజాసిటీ/ఖాన్‌ యూనిస్‌/జెరూసలేం:  గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్‌ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్‌ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్‌–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు.

34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్‌ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్‌ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్‌ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.  

అల్‌–ఖుద్స్‌ ఆసుపత్రి సమీపంలో పేలుడు   
గాజాలో ఆదివారం ఉదయం అల్‌–ఖుద్స్‌ హాస్పిటల్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్‌ సైన్యం స్పందించింది.

హమాస్‌ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.   

గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్‌ వేటు  
హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్‌ మంత్రిపై సస్పెన్షన్‌ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్‌ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు.

మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్‌ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు.    

అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్‌ భేటీ    
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్‌ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.   

జర్నలిస్టుకు తీరని దుఃఖం  
అల్‌–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్‌ అలలౌల్‌కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్‌ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్‌ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్‌–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్‌ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు