రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ

20 Jul, 2022 20:09 IST|Sakshi

సివిల్‌ ఇంజినీరింగ్‌లో రైల్వే ఉద్యోగి పరిశోధన

యాష్, క్రషర్‌ డస్ట్‌ ఉపయోగించి అధ్యయనం

ఏయూ నుంచి డాక్టరేట్‌ ఉత్తర్వుల స్వీకరణ  

సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌(బ్రిడ్జెస్‌)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్‌ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ స్వీకరించారు. ఏయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. 

విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్‌ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్‌ పాలిటెక్నిక్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్‌ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. 


వ్యర్థాలకు అర్థం చెప్పాలనే...  

విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా నేషనల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో భారీగా యాష్‌(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్‌ డస్ట్‌ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్‌ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్‌ ఎంచుకున్నారు. ఎన్‌టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. 

గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా..  
రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్‌ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్‌ గ్రేడ్, సబ్‌ బేస్‌ కోర్స్, బేస్‌ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్‌ బేస్‌ కోర్స్, బేస్‌ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్‌ యాష్, క్రషర్‌ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. 


సీబీఆర్‌ రేషియో ప్రామాణికంగా.. 

రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్‌ రేషియో(సీబీఆర్‌)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్‌ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్‌ యాష్, క్రషర్‌ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్‌ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్‌ బేస్‌ కోర్స్‌కు లిక్విడ్‌ లిమిట్‌ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్‌ 6 కన్నా తక్కువగా, సీబీఆర్‌ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి.

పట్నాయక్‌ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్‌ లిమిట్‌ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్‌ 6 కన్నా తక్కువగా, సీబీఆర్‌ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్‌)కు బాటమ్‌ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్‌ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్‌ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్‌ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు.  


పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..  

థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బాటమ్‌ యాష్‌ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్‌ విద్యుత్‌ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్‌ యూనిట్ల ద్వారా క్రషర్‌ డస్ట్‌ వెలువడుతోంది. యాష్, క్రషర్‌ డస్ట్‌ పర్యావరణానికి  సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్‌లో తుమ్‌లుక్‌ థిగా రైల్వే లైన్‌ నిర్మాణంలో బాటమ్‌ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. 
– డాక్టర్‌ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌(బ్రిడ్జెస్‌), వాల్తేర్‌ డివిజన్‌

మరిన్ని వార్తలు