సకలం.. సచివాలయం

19 Apr, 2022 17:39 IST|Sakshi

రేషన్‌ కార్డు రావాలంటే జన్మభూమి కమిటీ  తేల్చాలి. ఇళ్ల పట్టా కావాలంటే ఎమ్మెల్యే దగ్గర  పడిగాపులు కాయాలి. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరగాలి.. ఇలా సమస్యలకు పరిష్కారమే దొరికేది కాదు. ఇదంతా గతం. అలాంటి పరిస్థితులకు చెల్లుచీటీ పాడింది ప్రస్తుత ప్రభుత్వం.   

పాలనలో కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఇంటిముంగిటకే ప్రభుత్వ సేవలు తీసుకురావడంతో గ్రామీణ ప్రజలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది  అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాలకు 90 వేలకు పైగా వినతులు వచ్చాయి. పైసా లంచం లేకుండా, ఇంటికి కిలోమీటరు దూరం కూడా లేని పది నిమిషాల నడకతో సమస్య పరిష్కారం అవుతుండటంతో పట్టణ ప్రాంతాలే కాదు గ్రామీణులూ ఆనందపడుతున్నారు. పారదర్శక పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ/ వార్డు సచివాలయ– వలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చి పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సేవలన్నీ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే వచ్చాయి. సమస్య ఏదైనా సచివాలయ స్థాయిలోనే పరిష్కారం లభిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్‌ 14 వరకు  సచివాలయాలకు అక్షరాలా 90,095 వినతులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవే 63,701 వినతులు వచ్చాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్నిబట్టి చూస్తే మొత్తం వినతుల్లో 70 శాతం పైగా రెవెన్యూ సమస్యల మీద వచ్చినవే. భూములకు సంబంధించి 1బీ కోసం వచ్చిన వారు 23వేల మందికి పైగా ఉండగా,  అడంగల్‌ కోసం వచ్చిన వారు 14 వేల మంది పైచిలుకు ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 90వేల పై చిలుకు వినతులు రాగా, 72,302 పరిష్కారమయ్యాయి. కొన్ని వినతుల్లో స్పష్టత లేకపోవడం, సరైన సమాచారం లేకపోవడం కారణంగా పరిష్కారానికి నోచుకోలేదు.  

పింఛన్లకు వెల్లువలా దరఖాస్తులు 
జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల నుంచి పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. గడిచిన నాలుగున్నర నెలల్లో 7,519 మంది వృద్ధాప్య, 4,706 మంది వితంతు, 686 మంది ఒంటరి మహిళలు, వైకల్య పింఛన్ల కోసం 2433 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత ఉన్న వాళ్లందరికీ ఆన్‌లైన్‌ ద్వారానే మంజూరు చేశారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా రెండు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 90 శాతం వినతులకు పరిష్కారం లభించింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు కోసం 1,315 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 1,279 మందికి మంజూరు చేశారు. గతంలో వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు రావాలంటే చాలాకాలం వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా సదరం కింద 881 వినతులు రాగా అన్నింటికీ పరిష్కారం చూపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే మెజారిటీ సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు అక్కడికొస్తున్న లబ్ధిదారులు చెబుతున్నారు. 

నెల రోజుల్లోనే బియ్యం కార్డు 
మా ఊర్లో సచివాలయం వచ్చిన తర్వాత అధికారులు ఇక్కడే ఉండి పనులు చేస్తున్నారు. బియ్యం కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకొన్నాం. తర్వాత ఏ కార్యాలయాలకూ వెళ్లకుండా నెల రోజుల్లోనే అధికారులు మాకు బియ్యంకార్డు మంజూరు చేశారు.  
–ఎం. సరోజమ్మ, ఓబులంపల్లి, చెన్నేకొత్తపల్లి మండలం 

సచివాలయాల్లోనే అర్జీలు 
సమస్యలపై అధికారులకు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లకుండా గ్రామ సచివాలయంలోనే అర్జీలు ఇస్తున్నాం. సర్టిఫికెట్ల మంజూరుతో పాటు సమస్యల  పరిష్కారం కూడా గ్రామస్థాయిలోనే   అవుతోంది. సచివాలయ వ్యవస్థ వచ్చాక గ్రామీణులకు మేలు కలుగుతోంది.       
– లక్ష్మీనారాయణ,బాలేపాళ్యం, కనగానపల్లి మండలం

మరిన్ని వార్తలు