నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు

27 Feb, 2022 04:03 IST|Sakshi

ఇప్పటికే విభజన కసరత్తు ప్రారంభం

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

అడ్వొకేట్‌ జనరల్‌కు పంచాయతీరాజ్‌ శాఖ లేఖ 

కొత్త జెడ్పీలో సీఈవో, డిప్యూటీ సీఈవో, డీపీవో పోస్టులు 

సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా  కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్‌ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్‌ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు 
మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్‌ఎస్‌ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. 
ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్‌ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది.  ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌కు   లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్‌ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  

మరిన్ని వార్తలు