Sakshi News home page

Dalit Bandhu Beneficiaries: ‘నియోజకవర్గానికి 100 మంది ఎంపిక’ ఓకే.. మరి మా పరిస్థితి ఏమిటి?

Published Sun, Feb 27 2022 4:12 AM

Dalitha Bandhu Scheme Takes To Much Time For Implementation - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలాల్లో పథకం అమలులో ప్రతిష్టంభన నెలకొంది. రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం కాలేదు. ఆయా మండలాలకు రూ.250 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు అతీగతీ లేకుండా పోయింది. మరోవైపు ఈ మండలాలను మినహాయించి ఆయా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం శరవేగంగా పూర్తి కావొస్తోంది. దీంతో తమకు లబ్ధి ఎప్పుడు కల్పిస్తారని పైలట్‌ మండలాల్లోని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. 

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. 
గత ఏడాది ఆగస్టు 16న హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాలు పైలట్‌ మండలాలుగా ఎంపికయ్యాయి. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా మూడు మండలాలు ఒక్కో దానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదంతా జరిగి ఐదు నెలలవుతున్నా పథకం అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 

మధ్యలోనే ఆగిన అమలు ప్రక్రియ 
ప్రభుత్వం పైలట్‌ మండలాల ప్రకటన చేయగానే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం మండలాల్లో ఎస్సీ కుటుంబాల లెక్కలు తీశారు. చింతకాని మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 4,312 కుటుంబాలు, చారకొండ మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 1,267 కుటుంబాలు, తిరుమలగిరి మండలంలోని మున్సిపాలిటీ, 16 గ్రామపంచాయతీల్లో 2,382 కుటుంబాలు, నిజాంసాగర్‌ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 1,933 కుటుంబాలను గుర్తించారు. జిల్లా స్థాయి అధికారులు ఒక్కొక్కరికీ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేశారు.

పథకం అమలు తీరు, యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై ఈ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అవగాహన కల్పించలేదు. అంతేకాదు మూడు నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో పథకం అమలు ప్రక్రియ నిలిచిపోయినట్లయింది. చింతకాని మండలంలో తొలి విడతలో వెయ్యి కుటుంబాలు, మిగతా మూడు మండలాల్లో 500 చొప్పున కుటుంబాలకు దళితబంధు ద్వారా లబ్ధి చేకూరాల్సి ఉంది. ఇందులో భాగంగా 200కు పైగా యూనిట్లను గుర్తించారు. వీటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఏది ఎంచుకుంటే ఆ యూనిట్‌ను అధికార యంత్రాంగం గ్రౌండింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. 

మా పరిస్థితి ఏమిటి? 
పైలట్‌ మండలాల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తదుపరి దశలో ప్రకటించిన నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం చివరి దశకు చేరింది. ఒక్కో నియోజకవర్గంలో రెండు నుంచి పది వరకు గ్రామాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి అధికార యంత్రాంగానికి జాబితాలు పంపించారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పిస్తోంది. దీంతో పైలట్‌ మండలాల్లోని లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ మండలాలను పథకం అమలుకు ముందుగా ఎంపిక చేసి ఊరించారని, కానీ అవగాహన, యూనిట్ల మంజూరులో జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. 

ఎదురుచూస్తున్నాం.. 
దళితబం«ధు పథకానికి చింతకాని మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయటంతో ఎంతో సంబరపడిపోయాం. ఐదు నెలలు గడిచిపోయాయి. ఏం జరుగుతోందో తెలియదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా యూనిట్ల మంజూరు ప్రక్రియ వెంటనే చేపట్టాలి. 
– మామిళ్ల బాబు, మత్కేపల్లి, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా 

పైసలు ఎప్పుడిస్తరో చెబుతలేరు  
దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తమన్నరు. సార్లు వచ్చి పేర్లు రాసుకున్నరు. పైసలు వస్తే ఊరిలో కిరాణ షాపు పెట్టుకుందామనుకున్నా. కానీ ఇంకా పైసలు ఇయ్యలేదు. ఎప్పుడిస్తారో కూడా చెబుతలేరు.  
– మాడుగుల సైదమ్మ, చంద్రాయన్‌పల్లి, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

ఎటువంటి ఆదేశాలు రాలేదు.. 
చింతకాని మండలానికి మొదటి విడతగా ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించారు. కానీ పథకం అమలును ముందుకు తీసుకెళ్లడంపై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.  
– బి.రవికుమార్, ఎంపీడీఓ, చింతకాని మండలం, ఖమ్మంజిల్లా  

Advertisement

తప్పక చదవండి

Advertisement