ఎన్‌440కె ఏపీలో వచ్చిన వేరియంట్‌ కాదు..

7 May, 2021 08:16 IST|Sakshi

గత సెప్టెంబర్‌లో తెలంగాణలోనే గుర్తించారు

మహరాష్ట్రలో అంతకుముందే విస్తరించింది

సీసీఎంబీ మాజీ సైంటిస్ట్‌ డాక్టర్‌ జగన్నాథరావు

సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఏపీలో వచ్చినట్టు చెప్పుకొంటున్న ఎన్‌440కె వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇక్కడ వచ్చింది కాదని, గత ఏడాది సెప్టెంబర్‌లోనే హైదరాబాద్‌లో గుర్తించామని సీసీఎంబీ మాజీ సైంటిస్ట్‌ డాక్టర్‌ జగన్నాథరావు చెప్పారు. ఇప్పుడు దీని ప్రభావం లేదని తెలిపారు. ఒక టీవీ చానల్‌లో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఇప్పుడు వచ్చిందనో, ఏపీలో పుట్టిందనో చెప్పడం సరికాదన్నారు. 8 నెలల కిందటే సీసీఎంబీలో గుర్తించినట్లు తెలిపారు. ఇప్పుడు దీని ప్రభావం తగ్గిపోయిందని, ఇతర వేరియంట్‌ల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. వేరియంట్‌లకు పేరు మనం పెట్టుకునేది కాదని, జీనోమ్‌ సీక్వెన్స్‌ మేరకు ఒక కన్సార్టియం నిర్ణయించిందన్నారు.

అందులో సీసీఎంబీ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ వేరియంట్‌ ఎప్పటినుంచో మహరాష్ట్రలో ఉందని తెలిపారు. వేరియంట్‌లలో రెండు రకాలు.. వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్, వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నట్టు తేలిందన్నారు. వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు వేరియంట్‌లు ఎక్కడ పుట్టాయి అన్నది ముఖ్యం కాదని, వాటి ఉధృతి ఎలా ఉంది, దాన్ని తట్టుకునేందుకు ఏం చేయాలి అన్నదానిపైనే ముందుకెళ్లాలని చెప్పారు. కరోనా సోకి భిన్నమైన లక్షణాలున్న వ్యక్తినుంచి నమూనాలు సేకరించి ప్రయోగం చేస్తేగాని వేరియంట్స్‌ గురించి తెలియవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం మంచిదని ఆయన చెప్పారు.

చదవండి: కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్‌   
‘సీఎం జగన్‌ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు