వెనకబడిన వర్గాల్లోని మహిళాభ్యున్నతికి సీఎం జగన్ కృషి: సజ్జల

26 Jul, 2021 20:10 IST|Sakshi

నూర్ బాషా కార్పొరేషన్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ఏలూరులో దూదేకుల మహిళకు మేయర్ పదవి ఇవ్వబోతున్నామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నూర్ బాషా కార్పొరేషన్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత: మంత్రి వేణుగోపాలకృష్ణ
బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను అందించి పేదల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. పేదల కోసం అందించే విద్య,వైద్య విధానంలో కార్పొరేట్ స్థాయి కన్న గొప్పగా ఉండేలా వినూత్న పథకాలు సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం: లేళ్ల అప్పిరెడ్డి
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలలోని ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలన్నారు. వెనుకబడిన వర్గాల ఎదుగుదల కోసమే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన వర్గాల భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనని  లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు