పిచ్చోడి వీరంగం.. రోడ్డుపై, ఆస్పత్రిలో రచ్చ రచ్చ

17 Aug, 2021 07:49 IST|Sakshi

గుత్తి: గుత్తిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. అతను విసిరిన రాయి తగిలి ఎన్‌టీపీసీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతన్ని స్థానికులు చితకబాదగా గాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా వీరంగం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన మునినాయక్‌ గుత్తి సమీపంలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) సబ్‌ స్టేషన్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామం నుంచి బైక్‌పై సబ్‌స్టేషన్‌కు బయలుదేరారు. గుత్తి శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్దకు చేరుకోగానే ఓ పిచ్చోడు అకారణంగా విసిరిన రాయి మునినాయక్‌ను బలంగా తాకింది.

దీంతో బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వీరంగం..: ఎన్‌టీపీసీ ఉద్యోగిపై దాడి చేసిన పిచ్చోడిని స్థానికులు చితకబాదారు. అనంతరం గాయపడిన అతన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు చికిత్స చేస్తుండగా అతను మరోసారి రెచ్చిపోయాడు. సెలైన్‌ స్టాండ్‌ తీసుకుని వైద్య సిబ్బందిపై దాడికి యత్నించడంతో అంతా చెల్లాచెదురయ్యారు. అద్దాలను ధ్వంసం చేశాడు. అతి కష్టంపై కొందరు యువకుల సాయంతో పోలీసులు అతన్ని పట్టుకుని, కాళ్లూచేతులు కట్టేసి చికిత్స చేయించారు. అతని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. తనది హైదరాబాద్‌ అని మాత్రమే చెప్పి, ఆ తర్వాత కేకలు వేస్తూ దాదాపు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు.     

మరిన్ని వార్తలు