సంగీత సరస్వతికి ‘నూజివీడు’ నీరాజనం

23 Oct, 2022 08:12 IST|Sakshi

నూజివీడు వీణకు  అంతర్జాతీయ ఖ్యాతి 

పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం

గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం

సీఎం జగన్‌ మనసును దోచిన నూజివీడు వీణ

విజయవాడ కల్చరల్‌:  వీణ.. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలు పలుకుతుంది.. కళాకారుల చేతిలో సప్త స్వరకుసుమాలను విరబూస్తుంది.. చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి, వీణా శ్రీవాణి, ఘంటసాల వెంకటేశ్వరరావు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, పప్పు సోమేశ్వరరావు, ఆదిభట్ల నారాయణదాసు తదితరులు ఈ వీణ ద్వారా మనోహర స్వరాలు పలికించి సంగీత సరస్వతికి నీరాజనాలు అందించారు. అంతటి మహత్తర వీణ తయారీ వెనుక కఠోర శ్రమ ఉంది. తపస్సు ఉంది. కళాకారులు నిరంతర తపోదీక్షతో వీణకు ప్రాణం పోస్తున్నారు. రాష్ట్రంలో బొబ్బిలి, విజయనగరం, నూజివీడు తదితర ప్రాంతాల్లో వీణలు తయారు చేసినా నూజివీడులో షేక్‌ మాబూ కుటుంబం తయారు చేసిన వీణకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.

దేశ విదేశాల్లో ఉన్న సంగీత విద్వాంసులు వీణ కోసం నూజివీడు కళాకారులను సంప్రదిస్తారు. శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాచందర్, నూకల చిన సత్యనారాయణ. నేదునూరి కృష్ణమూర్తి, ఈమని కల్యాణి, తంగిరాల ప్రణీత వంటి కళాకారులు నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణలపైనే రాగాలు పలికించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు నూజివీడు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దసరా మహోత్సవాల సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణనే ఉపయోగిస్తారు. 

తయారీ విధానం : 
వీణ తయారీకి ప్రత్యేక కలప అవసరం. సుతిమెత్తగా ఉండే పనస చెట్టు నుంచి వచ్చిన కలపను తయారీకి వినియోగిస్తారు. దీని తయారీకి సుమారు 20 రోజులు పడుతుంది. విడి భాగాలుగా తయారు చేసి.. వాటిని ఒకే రూపంలోకి తీసుకొస్తారు. ధర సుమారుగా రూ.40 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో.. షో కేసుల్లో అలంకరించుకునే చిన్న వీణలనూ నూజివీడు కళాకారులు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన వీణ కళా నైపుణ్యాన్ని చూసి గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు కూడా.   

ప్రపంచ రికార్డులు సొంతం  
నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణ పలు రికార్డులను సాధించింది. ముఖ్యంగా  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలనూ సాధించింది.  

ఈ వృత్తినే  నమ్ముకున్నాం 
తాతల కాలం నుంచి ఈ వృత్తినే నమ్ముకున్నాం. ఆర్డర్‌ చేసిన వారికి కావాల్సిన విధంగా వీణను తయారు చేసి అందిస్తాం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే నూజివీడులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మా తండ్రి షేక్‌ మీరాసాహెబ్‌ వద్ద వీణ తయారీలో శిక్షణ తీసుకున్నాను. మీరా అండ్‌ సన్స్‌ వీణా మేకర్స్‌ సొసైటీ ద్వారా సేవలందిస్తున్నాం.   
– షేక్‌ మాబూ

మరిన్ని వార్తలు