ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది?

4 Jun, 2023 15:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం మహా విషాదంగా మారింది. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. తాజాగా ప్రమాదం బారినపడిన విశాఖకు చెందిన ప్రత్యక్ష సాక్షి.. తమ ఘోర అనుభవాన్ని పంచుకున్నాడు. ఒడిశా దుర్ఘటన సమయంలో అసలేం జరిగిందో తమకు ఏం అర్థం కావడం లేదని అంటున్నాడు ప్రమాదంలో గాయపడిన లోకేష్‌. ఒకేసారి భారీగా శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు.

చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చిందని బోగీలు పల్టీలు కొట్టాయని చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు 40 నిమిషాల పాటు ట్రైన్ లోనే ఉండిపోయామని తెలిపారు. అద్దాలను పగలగొట్టుకుని బయటికి వచ్చామని, స్థానికులు సకాలంలో స్పందించడంతో చాలామంది బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలములో చుట్టూ కారు చీకటి ఉందని, ట్రైన్ ప్రమాదం ఏ నది మీదో జరిగికుంటే మొత్తం ప్రయాణికులు అందరూ చనిపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు.

‘నా ముందే ఎంతో మంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు. ప్రమాదంలో నా ఇద్దరు పిల్లలు చనిపోయారు అనుకున్నాను. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి నా కుటుంబం బయటపడింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో నాకు, నా భార్యకు మెరుగైన వైద్యం అందుతుంది. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ముఖ్యమంత్రికి మేమందరం రుణపడి ఉంటాం’ అని తెలిపాడు.
చదవండి: ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్‌ రైలు ఎక్కిన 30 మంది..

 

మరిన్ని వార్తలు