అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..

26 Sep, 2020 10:42 IST|Sakshi
సీజ్‌ చేసిన గండేపల్లి సొసైటీ భవనం (అంతరచిత్రం) సొసైటీ ప్రధాన ద్వారానికి అతికించిన సీజ్‌ నోటీసు

అక్రమాలపై ముఖం చాటేసిన గండేపల్లి సొసైటీ సిబ్బంది

విచారణ అధికారులకు సహాయ నిరాకరణ

రికార్డులు తారుమారు కాకుండా అధికారుల కఠిన చర్యలు

సొసైటీ భవనం, రికార్డులున్న బీరువాలు స్వాధీనం  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్‌ చేశారు. 

బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్‌ మేనేజర్లతో చైర్మన్‌ అనంత ఉదయ భాస్కర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు.

విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు.

ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్‌ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్‌ డివిజన్ల సహకార అధికారులు బీఎన్‌ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు.

అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్‌ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్‌ సహకార ఆఫీసర్‌ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా