సచివాలయాల్లోనూ ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు

27 Aug, 2023 04:24 IST|Sakshi

పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందే వీలు

పరీక్షల ఫీజు కూడా చెల్లించే అవకాశం

బడికి వెళ్లి చదవలేనివారికిమరింత వెసులుబాటు 

వచ్చే వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి.. 

వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు 

సాక్షి, అమరావతి: చదువు పట్ల ఆసక్తి ఉండి.. బడికి వెళ్లి చదువుకోలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ల్లో చేరే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే పరీక్ష ఫీజులను కూడా వీటిలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది.

వచ్చే వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇక నుంచి ఎవరైనా.. ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు వాటికి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపులు వంటి సేవలను తమ దగ్గరలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందొచ్చు.

ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ)ల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. ఈ సేవల టెస్టింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని.. వచ్చే వారంలో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అధికారికంగా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. 

తప్పనున్న ఇబ్బందులు..
కాగా, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ప్రవేశాలు పొందాలంటే ఇప్పటివరకు అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. సొంతంగా ఇంటర్‌నెట్‌తో కూడిన కంప్యూటర్, వెబ్‌ వినియోగంలో అవగాహన ఉన్నవారు ఇంట్లో నుంచే ప్రవేశాలు పొందేవారు. నెట్‌ సదుపాయం, అవగాహన లేకపోతే తమ ప్రాంతంలో లేదంటే, సమీప çపట్టణంలో నెట్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రవేశపెడుతుండటంతో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి.

మరోవైపు.. 14 ఏళ్ల లోపు బడి ఈడు పిల్లలు ఎవరైనా పాఠశాలలకు వెళ్లని పరిస్థితి ఉంటే.. అలాంటి వారందరినీ ఆయా ప్రాంత గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. వారందరినీ వంద శాతం బడుల్లో చేర్పించేలా ఇప్పటికే చర్యలు చేపట్టింది. అలాగే వివిధ కారణాలతో బడి వయసు ఉన్నవారు, బడులకు వెళ్లలేని వారితోపాటు 17 ఏళ్లు దాటిన వయోజనులు ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పదో తరగతి, ఇంటర్‌ చదువుకునే అవకాశాన్ని సచివాలయాల ద్వారా అందిస్తోంది. 

ఏటా నవంబర్‌నెలాఖరు దాకా అడ్మిషన్లు.. 
ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పది, ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబరు నెలాఖరు వరకు కొనసాగుతోందని ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి “సాక్షి’కి తెలిపారు. ప్రవేశాలకు పేర్ల నమోదు సెప్టెంబర్‌ 15 నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు ఎక్కువగా చేసుకుంటారని వెల్లడించారు. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పది, ఇంటర్‌ చదివే వారి కోసం ఈ ఏడాది నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆయా తరగతుల ఆన్‌లైన్‌ పాఠాల బోధన వీడియోలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

సార్వత్రిక విద్య అంటే.. మన దేశంలో కనీసం ఇంటర్‌గా గుర్తించిన నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది ఇంటర్‌లోపు చదువుకున్న వారు ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంటర్‌లోపు చదివిన వారందరినీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారానైనా చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు