రూ.310 కోట్లతో ఆక్సిజన్‌ వ్యవస్థ

10 May, 2021 03:34 IST|Sakshi

రాష్ట్రంలో కొత్తగా 49 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు

50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్ల కొనుగోలు.. 10 వేల ఆక్సిజన్‌ పైప్‌లైన్ల నిర్మాణం

ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.60 లక్షలు కేటాయింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ సరఫరా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆక్సిజన్‌ వ్యవస్థ మౌలిక వసతుల కోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.180.19 కోట్లతో 49 చోట్ల ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ 49 చోట్ల సివిల్, ఎలక్ట్రికల్‌ పనుల కోసం రూ.25.80 కోట్లు కేటాయించారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం రూ.46.08 కోట్లతో 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. అదనంగా 10,000 ఆక్సిజన్‌ పైప్‌లైన్ల నిర్మాణం కోసం రూ.50 కోట్లు వ్యయం చేయనున్నారు.

ఈ ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. ఈ సంస్థ ఆరు నెలల పాటు ఈ యూనిట్‌ నిర్వహణ, మరమ్మతులను చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు నెలకు రూ.10 లక్షల చొప్పున ఆరు నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ విధంగా మొత్తం ఆరు నెలలకుగాను ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రూ.7.80 కోట్లు వ్యయం అవుతుంది. ఆక్సిజన్‌ యూనిట్లు ఏర్పాటు చేసే బాధ్యతను ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పర్యవేక్షణ ఇన్‌చార్జ్‌గా స్పెషల్‌ సీఎస్‌ కరికాల 
ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇన్‌చార్జ్‌గా స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై దృష్టి సారించనున్నారు.  

మరిన్ని వార్తలు