సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..

5 Oct, 2021 03:20 IST|Sakshi
సీఎం జగన్‌కు సమస్యను వివరిస్తున్న సువ్వారి గాంధీ(ఫైల్‌)

బకాయిల విడుదల ఉత్తర్వులపై పింఛనర్ల ఆనందం  

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రూ.49 వేల చొప్పున అందుకోనున్న 165 మంది 

పొందూరు: తమకు ఓటేయలేదన్న కక్షతో టీడీపీ ప్రభుత్వం పింఛన్లు నిలిపివేసినవారికి ప్రభుత్వం న్యాయం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వారికి గత ప్రభుత్వం పింఛన్‌ పునరుద్ధరించినా.. బకాయిలు మాత్రం ఇవ్వలేదు. వాటి విడుదలకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలివ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని 2014లో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో టీడీపీ ప్రభుత్వం 880 మంది అర్హుల పింఛన్లు తొలగించింది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నాయకులు సువ్వారి గాంధీ, కొంచాడ రమణమూర్తిలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2015లో పింఛన్‌దారుల తరఫున కోర్టులో రిట్‌ పిటిషన్లు వేశారు. ఆ తర్వాత పలువురికి పింఛన్లు మంజూరు చేశారు. మిగిలిన వారికి బకాయిలతో సహా పింఛన్‌ మొత్తాలు చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వుల మేరకు 250 మందికి బకాయిలతో సహా చెల్లించారు.

ఆ తర్వాత తుది ఉత్తర్వుల ప్రకారం 198 మందికి 49 నెలల బకాయిలతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వారికి పింఛన్లు ఇచ్చిందిగానీ, బకాయిల ఊసెత్తలేదు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో 2020 డిసెంబర్‌ 4న సువ్వారి గాంధీ నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో 198 మందిలో బతికున్న 165 మందికి రూ.49 వేల చొప్పున బకాయిలు చెల్లించాలని గత నెల 23న ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో బాణాం, దల్లిపేట, కృష్ణాపురం, కేసవదాసుపరం, నందివాడ, లోలుగు, బురిడికంచరాం, మలకాం, తండ్యాం, రాపాక, వీఆర్‌ గూడెం, దళ్లవలస, తోలాపి, కనిమెట్ట, సింగూరు, మొదలవలస, తాడివలస, గోకర్నపల్లి గ్రామాల్లోని 165 మంది లబ్ధిదారులు రూ.49 వేలు చొప్పున పింఛన్‌ బకాయిలు అందుకోనుండటంతో వారు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.  

టీడీపీకి ఓటేయలేదని మా పింఛన్‌ తీసేశారు.. 
తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనే ఆ నాడు పింఛన్లు తొలగించారు. త్వరలోనే రూ.49 వేలు అందుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. 
    – పి.సన్యాసమ్మ, పింఛన్‌దారు, తాడివలస

జన్మభూమి కమిటీల అరాచకం
టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల అరాచకం అంతా ఇంతా కాదు. అర్హుల పింఛన్లు తొలగించడంతో కోర్టుకు వెళ్లాం. కోర్టులు మాకు న్యాయం చేశాయి. అయితే బకాయిలు విడుదల చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకు అండగా నిలిచారు. 
– సువ్వారి గాంధీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, పొందూరు  

మరిన్ని వార్తలు