పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ సర్వేరాళ్లు 2008లోనే ఏర్పాటు

13 Apr, 2023 04:50 IST|Sakshi

విభజన నేపథ్యంలో ఆ రికార్డులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయన్న పోలవరం సీఈ సుధాకర్‌బాబు

వాటిని సమీకరించి పీపీఏకు అందజేస్తామని స్పష్టీకరణ

ముంపు ప్రభావంపై నివేదిక, రికార్డులు పీపీఏ ద్వారా ఏపీకి ఇచ్చిన తెలంగాణ అధికారులు

వాస్తవాలను ఏపీ దాస్తోందని, అందువల్లే రికార్డులు ఇవ్వడం లేదని తెలంగాణ ఈఎన్‌సీ ఆరోపణ 

ఎఫ్‌ఆర్‌ఎల్‌ మ్యాప్, సర్వే రాళ్లకు సంబంధించిన రిపోర్టు సీడబ్ల్యూసీ, తెలంగాణ వద్ద ఉందన్న పోలవరం సీఈ 

వాస్తవాలను దాయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేనేలేదని స్పష్టీకరణ

ఈనెల 14న ఎఫ్‌ఆర్‌ఎల్‌ మ్యాప్, సర్వే రాళ్ల నివేదిక ఇస్తామని వెల్లడి

ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్న పీపీఏ సభ్య కార్యదర్శి

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో 2008లోనే గుర్తించి, సర్వేరాళ్లు ఏర్పాటుచేశామని తెలంగాణ అధికారులకు ఆ ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మరోసారి తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ఈనెల 14లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఇస్తామన్నారు. ఆ రికార్డులను పరిశీలించాక కూడా ఏమైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ సర్వేరాళ్లను చూపించడానికి తా­ము సిద్ధమని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ మ్యాప్, ముంపు ప్రాంతాల్లో వేసిన సర్వేరాళ్ల (అక్షాంశాలు, రేఖాంశాలతో కూ­డి­న) వివరాలను ఏపీ ప్రభుత్వం అందజేశాక మరోసారి సమావేశం నిర్వహిస్తామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.­రఘురాం రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపుపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల 3న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)  చైర్మన్‌ కుస్విందర్‌సింగ్‌ వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ మూడోసారి సమావేశమైంది.

గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో పోలవ­రం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, అందులో ఎలాంటి ముంపు ముప్పు ఉండ­దని తేలిందని ఎత్తిచూపుతూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు గతంలో గోపాలకృష్ణన్‌ నే­తృ­త్వంలో ఏర్పాటు చేసిన సాధికార కమిటీ కూడా సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికనే ఖరారు చేసిందని గుర్తుచేశారు.

పో­లవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌పై ఏపీ, తెలంగాణ అధికారులు అధ్య­యన నివేదికలను మార్చుకుని, చర్చించి.. తెలంగాణ అభ్యంతరాలను నివృత్తి చేయాలని పీపీఏను సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరా ఆదేశించారు. ఆ మేరకు బుధవారం పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఏపీ తరఫున పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, తెలంగాణ తరఫున ఈఎన్‌సీ కె.నాగేంద్రరావు, ఆ రాష్ట్ర అంతర్‌రాష్ట్ర జలవన­రుల విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

మరోసారి భేటీ..  
పోలవరం ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ మ్యాపు, సర్వేరాళ్లకు సంబంధించిన రికార్డులు ఏపీ అధికారులు అందజేసిన తర్వాత.. రెండు రాష్ట్రాల అధికారులతో భౌతికంగా సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్‌సీ నాగేంద్రరావు చేసిన ప్రతిపాదనను పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం ఆమోదించారు. ఏపీ అధికారులు ఇచ్చే రికార్డులను తెలంగాణ అధికారులకు పంపుతామన్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారులతో చర్చిస్తామని చెప్పారు. అప్పటికీ తెలంగాణ సర్కార్‌ సంతృప్తి చెందకపోతే.. ఎఫ్‌ఆర్‌ఎల్‌ రాళ్లను క్షేత్రస్థాయిలో చూపించడానికి సంయుక్తంగా వెళదామని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ అందరికీ తెలిసిందే.. 
పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలోకి కిన్నెరసాని, ముర్రే­డు­వాగులతోపాటు మరో ఆరువాగులు వస్తాయని.. వాటిలోకి బ్యాక్‌వాటర్‌ ఎగదన్ని తమ రాష్ట్రంలో బూ­ర్గుం­పహాడ్‌ మండలంలో 899 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని తెలంగాణ ఈఎన్‌సీ నాగేంద్రరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పీపీఏ ద్వారా ఏపీ అధికారులకు అందజేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగులపై పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, ఆ నివేదిక తెలంగాణ అధికారుల వద్ద కూడా ఉందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు గుర్తుచేశారు.

పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 2008లోనే గుర్తించి.. ముంపునకు గురయ్యే ప్రాంతాల­ను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి.. సర్వేరాళ్లు కూ­డా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులు రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని సమీకరించి ఈనెల 14న అందజేస్తామని చెప్పారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ స్పందిస్తూ పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం వల్ల ముంపు ప్రాంతంపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలను దాచేస్తోందని, అందువల్లే రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సంబంధించిన రికార్డులన్నీ సీడబ్ల్యూసీ వద్ద, తెలంగాణ అధికారుల వద్ద ఉన్నాయని.. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదని పోలవరం సీఈ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. బూర్గుంపహాడ్‌లో ముంపునకు గురయ్యే 899 ఎకరాల భూమిని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని, దాన్ని ఏపీకి అప్పగించే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు