ఖాకీల్లో గుబులు!

7 Sep, 2020 07:04 IST|Sakshi

అవినీతి అధికారులపై ఆరా!

వివరాలు సేకరిస్తున్న పోలీస్‌ కమిషనర్‌

సాక్షి, అమరావతిబ్యూరో: గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు చేపట్టేందుకు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు రంగం సిద్ధం చేశారు. బాధ్యతగా ఉండాల్సింది పోయి మామూళ్ల మత్తులో జోగుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు చేస్తున్నారు. గంజాయి ముఠాలకు పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీపీ భావిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. 

అక్రమార్జనే ధ్యేయం
విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేమాల్సిన పోలీసు అధికారులు గత ప్రభుత్వ పాలనలో అడ్డదారుల్లో పయనించి, అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఇప్పటికీ అదేరీతిలో భక్షకులై చెలరేగిపోతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన వారిని నయానో.. భయానో తమ దారికి తెచ్చుకుని దోచేస్తున్నారు. నానా తంటాలు పడి పోస్టింగ్‌ తెచ్చుకున్నాం. ‘ఇప్పుడు కాక మరెప్పుడు..’ సంపాదించుకోవాలనే తరహాలో రీతిలో దందాలు, దోపిడీ మార్గంలో ఉరకలేస్తున్నారు. ఇలా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఏకంగా పోలీసు కమిషనరేట్‌లోనే అక్రమాలకు తెరలేపారు. గంజాయి, గుట్కా వ్యాపారులకు అండదండలు అందిస్తూ వారి నుంచి నెలవారీ ముడుపులు దండుకుంటున్నారు. స్టేషన్‌లకు వచ్చే కేసులనే ఆదాయ వనరులుగా మార్చుకుని దోపిడీకి బరితెగిస్తున్న పోలీసు శాఖలోని పలువురి అధికారులపై పోలీసు బాస్‌ సీరియస్‌గా ఉన్నారు. 

అన్నీ నమ్మినబంటుల ద్వారానే..  
భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, వైట్‌ కాలర్‌ పంచాయతీలను చక్కబెట్టడానికి.. గుట్టుచప్పుడు కాకుండా వాటాలను అందజేయానికి అడ్డదారిలో వెళ్తున్న అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పోలీసుల్లో పారదర్శకత లోపిస్తున్న విషయంపై ఇంటిలిజెన్స్‌ వర్గాలు నివేదించడం లేదా? ఈ అక్రమాలు పైస్థాయికి వెళ్లడం లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.  

అవినీతి పోలీసులపై ఆరా 
విజయవాడ నగరం వ్యవస్థీకత నేరాలకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం భూకబ్జాలు, సివిల్‌ తగాదాలు, జీరో వ్యాపారం, కాల్‌మనీ, గంజాయి వంటి కేసులతో కొన్ని పోలీసు స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఇదే కొందరు పోలీసులకు ఆదాయ వనరుగా మారింది. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారు. వెండి, బంగారు వ్యాపారులతో కుమ్మక్కై వారు చేసే జీరో వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొంత మందికి గంజాయి మాఫియా సభ్యులతో సంబంధాలున్నట్లు తేలినట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు శాఖాపరమైన చర్యలకు సీపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. దీంతో గంజాయి స్మగ్లర్లతో సంబంధమున్న పోలీసుల్లో గుబులు మొదలైంది.    

మరిన్ని వార్తలు