మానవ అక్రమరవాణాకు చెక్‌

10 Sep, 2021 05:13 IST|Sakshi

ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌

కొత్తగా 10 స్టేషన్ల ఏర్పాటు

దిశ పోలీస్‌ స్టేషన్లతో అనుసంధానం

రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు

సాక్షి, అమరావతి: మానవ అక్రమరవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. జిల్లాకు ఒక మానవ అక్రమరవాణా నిరోధక పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి ఉన్న మూడు స్టేషన్లకు అదనంగా కొత్తగా పదింటిని ఏర్పాటు చేస్తారు. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో మానవ అక్రమరవాణా నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం కింద గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో మాత్రమే ఏర్పాటు చేసింది. వాటికి పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించలేదు. మౌలిక వసతులు కల్పించలేదు.

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మానవ అక్రమరవాణాను పూర్తిగా అరికట్టటంపై దృష్టి సారించింది. పేదరికాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలు, చిన్నపిల్లలను అక్రమంగా తరలిస్తూ బలవంతంగా అసాంఘిక కార్యకలాపాల కూపంలోకి నెడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని నిరోధించి మహిళలు, చిన్నారుల హక్కులను కాపాడేందుకు వెంటనే జిల్లాకు ఒకటి చొప్పున మానవ అక్రమరవాణా నిరోధక పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న మూడు స్టేషన్లకు అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

ఒక్కో పోలీస్‌ స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌.ఐ.లు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. వీలైనంతవరకు మహిళా పోలీసు అధికారులు, సిబ్బందినే ఈ స్టేషన్లకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై దాడులు, వేధింపుల నిరోధానికి ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌ స్టేషన్లతో వీటిని అనుసంధానించాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించింది. మానవ అక్రమరవాణాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా సమకూరుస్తారు. దీనిపై పోలీసుశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు