అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం

6 Oct, 2020 03:43 IST|Sakshi
భువన్‌రెడ్డి అలిండియా జనరల్‌లో 2వ ర్యాంకర్, లండా జితేంద్ర అలిండియా జనరల్‌లో 14వ ర్యాంకర్‌

జేఈఈ ఫలితాల్లో మెరిసిన ప్రొద్దుటూరు, విజయనగరం విద్యార్థులు

ఆలిండియా జనరల్‌లో 2వ ర్యాంకు, ఓబీసీలో 1వ ర్యాంకు మనవే

నేటి నుంచి ‘జోసా’ కౌన్సెలింగ్‌ ప్రారంభం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్సుడ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్‌ కేటగిరీలో సెకండ్‌ ర్యాంకు, ఈడబ్యూఎస్‌ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి (345 మార్కులు) సాధించాడు.  ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్‌ జోన్‌లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్‌ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో  321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్‌ జోన్‌ పరిధిలో టాప్‌ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. 
– ఆలిండియా జనరల్‌లో కాపెల్లి యశ్వంత్‌సాయి  (ఏలూరు) 32వ ర్యాంకు,  చిలుకూరి మణిప్రణీత్‌ (విజయవాడ) 47వ ర్యాంకు,  కందుల యశ్వంత్‌ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్‌ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్‌ ఈడబ్ల్యూఎస్‌ 11వ ర్యాంకు,  నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్‌ 12, మోగంటి హర్షదీప్‌ ఈడబ్ల్యూఎస్‌ 13, వారాడ జశ్వంత్‌నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్‌సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్‌కృష్ణ ఈడబ్యూఎస్‌ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్‌ ఓబీసీ 54, ఎస్‌.వి.సాయిసిద్దార్థ్‌ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్‌ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్‌ 47,  ఎస్‌.విష్ణువర్థన్‌ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్‌రెడ్డి ఈడబ్యూఎస్‌ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్‌ 57 ర్యాంకులను సాధించారు. 

ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే...
ఆలిండియా జనరల్‌ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్‌రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. 

ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం..
లాక్‌డౌన్‌కు ముందు విజయవాడలోని కార్పొరేట్‌ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్‌ అయ్యానని వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తెలిపాడు. మెయిన్స్‌లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్‌రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్‌రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారు.  

టెన్త్‌ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర
విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర  విజయవాడలోని కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివాడు. టెన్త్‌ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు