ప్రతి గ్రామానికీ రక్షిత తాగునీరు 

10 Oct, 2021 04:27 IST|Sakshi
వర్చువల్‌ విధానంలో మాట్లాడుతున్న నేషనల్‌ జల్‌జీవన్‌ మిషన్‌ అడిషనల్‌ సెక్రటరీ భరత్‌లాల్‌

నేషనల్‌ జల్‌జీవన్‌ మిషన్‌ అడిషనల్‌ సెక్రటరీ భరత్‌లాల్‌   

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగు నీరు అందించాలన్నదే తమ మిషన్‌ ప్రధాన ఉద్దేశమని నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ అడిషనల్‌ సెక్రటరీ భరత్‌లాల్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్‌లోని ఆంధ్రా మోటార్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ (అమ్మ) హాలులో ‘గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం’ అంశంపై సిబ్బందికి శనివారం వర్క్‌షాప్‌ జరిగింది. భరత్‌లాల్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా లేదని, 5 శాతం మంది నీటి కుళాయి కనెక్షన్లు పనిచేయడం లేదని, మరో 9 శాతం మంది తమకు నీరు సమృద్ధిగా అందడం లేదని తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు చెప్పారన్నారు.

ప్రారంభ సభకు అతిథిగా హాజరైన కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ..జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా అందరికీ నీరు అందేందుకు అంచనాలను సక్రమంగా రూపొందించాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలకు, గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. నేషనల్‌ జల్‌జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్, డెప్యూటీ డైరెక్టర్‌ ఏ మురళీధరన్, రాష్ట్ర నీటి పారుదల, పారిశుధ్య శాఖ చీఫ్‌ ఇంజనీరు ఆర్‌.బి.కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు