‘ఆయుష్’కు కొత్త కళ

20 Oct, 2023 05:09 IST|Sakshi

తొలి దశలో 110 డిస్పెన్సరీల అభివృద్ధి

రూ.3.5లక్షలతో ఒక్కో ఆస్పత్రి ఆధునికీకరణ 

రూ.12 కోట్లతో భవిష్యత్‌ అవసరాల కోసం మందుల కొనుగోలు 

‘నాడు–నేడు’ ద్వారా రూపురేఖలు మార్చేస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్‌ డిస్పెన్స­రీలు సరికొత్త రూపును సంతరించుకుంటు­న్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వా­నంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందు­లు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్‌ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్‌ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది.

ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసి­న 110 డిస్పెన్సరీలను ఆధు­ని­కీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్‌ పనులు చేస్తున్నారు. సోలార్‌ ప్యానల్స్‌ను అమర్చి విద్యుత్‌ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయ­డం వంటి పనులన్నీ పూర్తయ్యాయి.   

రూ.12 కోట్లతో మందుల సరఫరా
ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్‌ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మం­దులు వినియోగంలో ఉండగానే భవిష్యత్‌లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది.

రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్‌ మందుల తరహాలోనే ఆయుష్‌ మందులను కూడా ట్యాబ్‌లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్‌ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌బీ రాజేంద్రకుమార్‌ లగింశెట్టి తెలిపారు.

మరిన్ని వార్తలు