దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా

1 Nov, 2023 04:37 IST|Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష స్క్రీనింగ్‌లో బయటపడిన బీపీ, షుగర్, క్షయ కేసులు

కొత్తగా 2.25 లక్షల బీపీ కేసులు, 1.40 లక్షల షుగర్‌ కేసులు నిర్ధారణ

క్షయ అనుమానిత లక్షణాలున్న 1.78 లక్షల మందికి పరీక్షలు

417 మందిలో క్షయ వ్యాధి నిర్ధారణ

వీరికి స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ఉచిత వైద్యం.. ఫ్యామిలీ డాక్టర్‌తో నిరంతర పర్యవేక్షణ  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్‌ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్‌), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

1.84 కోట్ల మందిలో షుగర్‌ లక్షణాలు..
గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్‌ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్‌ జ­బ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించి­న నాన్‌–కమ్యూనికబుల్‌ డిసీజెస్‌(ఎన్‌సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్‌ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కే­సు­లు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నె­ల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలు­గులోకి వచ్చాయి.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్‌ కేసులను గుర్తించారు. మరోవైపు క్ష­య అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుం­చి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అ­లాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గు­ర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది.

దాదాపు 8 లక్షల మందిలో కంటి స­మస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సా­ధారణ మందులతో తగ్గే సమస్యలు­న్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మంది­ని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్‌ సర్జరీలకు రిఫర్‌ చేశారు. వీరిలో 833 మంది­కి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్ష­య తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సు­­రక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. 

ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు..
చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్‌ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్‌ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

షుగర్‌ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ
జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్‌1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం.  –జె.నివాస్, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు
గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి.  – డాక్టర్‌ బాబ్జీ, సీనియర్‌ వైద్యుడు, వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ

మరిన్ని వార్తలు