11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

31 Dec, 2021 04:18 IST|Sakshi

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌

కరప: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

రబీ సీజన్‌లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు.  

>
మరిన్ని వార్తలు