బంగాళాఖాతంలో అల్పపీడనం

6 Sep, 2023 05:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం బుధవారం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది.

మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ వరకు కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది.

మంగళవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. అల్పపీడనం, ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40–45 కి.మీ, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.  

మరిన్ని వార్తలు