ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం

5 Mar, 2023 03:54 IST|Sakshi

మొత్తం రూ.88 వేలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్‌ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్‌గేట్‌ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్‌గేట్‌ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్‌గేట్‌ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు.

పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలం టోల్‌గేట్‌ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నర­సన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తు­న్న­ట్లు తెలిసింది. టోల్‌గేట్‌ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది.

ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీ­లో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్‌ కోర్టుకు పంపుతామని, ఎవ­రైనా క్లెయిమ్‌ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్‌ఐ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు