ఏపీ: జాతీయ రహదారుల నిర్మాణం రయ్‌.. రయ్‌..

8 Mar, 2021 04:31 IST|Sakshi

జాతీయ రహదారుల నిర్మాణానికి వేగంగా డీపీఆర్‌లు

కన్సల్టెన్సీ సర్వీసులకు కేంద్రం ఆమోదం

383 కిలోమీటర్ల మేర అభివృద్ధి

కొత్తగా 200 కిలోమీటర్ల మేర నిర్మాణానికి నివేదికలు

మూడు ఎన్‌హెచ్‌ల బలోపేతానికి రూ.115.92 కోట్లు

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను శరవేగంగా రూపొందించనున్నారు. మొత్తం 383.60 కిలోమీటర్ల మేర కొత్త ఎన్‌హెచ్‌ (నేషనల్‌ హైవే)ల నిర్మాణానికి, అభివృద్ధికి కేంద్రం అనుమతిచ్చింది. డీపీఆర్‌ల తయారీ కోసం కన్సల్టెన్సీ సర్వీసులకు గాను కేంద్రం రూ.17 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.6 కోట్ల నిధులతో కొత్తగా 200 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందిస్తారు. డీపీఆర్‌ల రూపకల్పనలో కీలక రహదారి ప్రాజెక్టులున్నాయి. 

సాక్షి, అమరావతి: ఎన్‌హెచ్‌–516–ఈ నిర్మాణంలో భాగంగా అరకు నుంచి బౌదార వరకు (పూర్తిగా కొండ ప్రాంతం) 42.40 కి.మీ.వరకు రూ.3 కోట్లతో డీపీఆర్‌ ఈ నెలాఖరుకు సిద్ధం చేయనున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 నిర్మాణాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజించారు.

రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం –కొయ్యూరు, కొయ్యూరు –లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు – బౌదార మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. అరకు–బౌదార ఘాట్‌ రోడ్డు డీపీఆర్‌ పూర్తైతే వచ్చే వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులు కేటాయించనుంది. ఏజెన్సీ ప్రాంతం చింతూరు–మోటు 8 కి.మీ.ల రోడ్డు అభివృద్ధికి డీపీఆర్‌ తయారు చేయనున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో కడప–రాయచోటి సెక్షన్‌లో ఐదు కి.మీ. టన్నెల్‌ నిర్మాణానికి డీపీఆర్‌ రూపొందించనున్నారు.  

మూడు ఎన్‌హెచ్‌ల బలోపేతానికి రూ.115.92 కోట్లు
రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల బలోపేతానికి కేంద్రం ఈ వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించింది. దేవరపల్లి–జంగారెడ్డిగూడెం, అనంతపురం–గుంటూరు, రేణిగుంట–కడప–ముద్దనూరు జాతీయ రహదారులకు మొత్తం 38.62 కి.మీ.మేర రోడ్ల బలోపేతానికి రూ.115 కోట్లు కేటాయించింది.  

మరిన్ని వార్తలు