విశాఖలో ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ సిద్ధం

8 Mar, 2021 04:35 IST|Sakshi

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపకల్పన

ఇకపై ఇక్కడి నుంచే గిరిజన జాతులపై అధ్యయనాలు 

వారి సంక్షేమ పథకాలపై మూల్యాంకనాలు కూడా..

1.19 ఎకరాల విస్తీర్ణంలో రూ.17.50 కోట్లతో భవన నిర్మాణం 

సాక్షి, అమరావతి: గిరిజన జాతులపై అధ్యయనం, వారికి సంబంధించిన సంక్షేమ పథకాల మూల్యాంకనం తదితరాల కోసం విశాఖపట్నంలోని రుషికొండ వద్ద నిర్మిస్తున్న ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటివరకు ఈ విభాగం రాష్ట్ర కార్యాలయంలో ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూషన్‌ నుంచి ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ను వేరుచేశారు. దీనిని విశాఖలో ఏర్పాటు చేసేందుకు వీలుగా అప్పట్లో ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్కడ రూ.17.50కోట్లతో 1.19 ఎకరాల్లో మిషన్‌ భవనాలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ ఒక్కో బ్లాక్‌లో మూడంతస్తుల చొప్పున మూడు బ్లాక్‌లు ఉన్నాయి. ఒక బ్లాక్‌లో పరిపాలన, రెండో బ్లాక్‌లో మిషన్‌ డైరెక్టర్‌ క్యాంపు కార్యాలయం, మరో బ్లాక్‌లో స్టాఫ్‌ క్వార్టర్స్‌ ఉంటాయి. 

ప్రారంభోత్సవానికి రెడీగా..
ప్రస్తుతం అన్ని హంగులతో పనులు పూర్తికావడంతో ఈ భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే, అరకులో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అక్కడ కూడా పనులు మొదలయ్యాయి. గిరిజనులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నందున వారి సంస్కృతీ సంప్రదాయాలు గురించి తెలుసుకునేందుకు వీలుగా ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి.

సంక్షేమ పథకాలపై అధ్యయనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గిరిజనాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని రీసెర్చ్‌ మిషన్‌లో అధికారులు మూల్యాంకనం చేస్తారు. పథకాల అమలుతీరును విశ్లేషించడం ద్వారా వీరికి అవి ఎలా లబ్ధిచేకూర్చాయో తేలుస్తారు. అలాగే, ఈ ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ ఇప్పటివరకు 20 మానవజాతి అధ్యయనాలు పూర్తిచేసింది. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వీడియో డాక్యుమెంటేషన్‌ను కూడా రూపొందించింది. 2019 డిసెంబరులో చత్తీస్‌ఘడ్‌లోని రాంచీలో జరిగిన నృత్యోత్సవంలో బైసన్‌ నృత్యానికి (కొమ్ము నృత్యం) ఏపీకి జాతీయస్థాయిలో మూడోస్థానం సాధించింది. కాగా, ఈ రీసెర్చ్‌ మిషన్‌లో గిరిజన సంతతులపై అధ్యయనానికి నిపుణులైన ప్రొఫెసర్లు ఉంటారు. ఇక్కడ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాగానే మరికొంతమందిని డిప్యుటేషన్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిపై ప్రభుత్వం నియమిస్తుంది.  

గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా..
ఈ ట్రైబల్‌ రీసెర్చ్‌ మిషన్‌ కార్యాలయం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుంది. వారి సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానానికి సంబంధించిన కళారూపాలు ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటుచేస్తాం. ఇకపై ఇక్కడ నిత్యం అధ్యయనాలు జరుగుతాయి. కొత్త అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తించి వారి జీవన సరళిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషిచేస్తుంది. 
– ఇ. రవీంద్రబాబు, మిషన్‌ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌  

మరిన్ని వార్తలు