ఏపీలో తగ్గిన నిరుద్యోగం

1 Dec, 2023 03:20 IST|Sakshi

రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల చేసిన ఆర్‌బీఐ

ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగుల సంఖ్య

చంద్రబాబు హయాం(2018–19)లో గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులు

2022–23లో 33 మందే..

బాబు హయాం(2018–19)లో పట్టణాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు

2022–23లో 65 మందే..

సత్ఫలితాలనిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చర్యలు

ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి పథకాల అమలే కారణం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగిత రేటు తగ్గింది. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా­(ఆర్‌బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.

ఈ కృషి ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగితపై ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. చంద్రబాబు హయాం(2018–19)లో నిరుద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే 2022–23లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని ఆర్‌బీఐ వెల్లడించింది. 

వైఎస్సార్‌సీపీ పాలనలో ఉద్యోగాలు, ఉపాధే లక్ష్యంగా..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా.. గ్రామ సచివాల­యా­ల్లో పది మంది చొప్పున, పట్టణ సచివాల­యాల్లో 11 మంది చొప్పున శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు 4.93 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇందులో శాశ్వత ఉద్యోగాలే 2.13 లక్షలు ఉన్నాయి. మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తద్వారా కొత్తగా 16.5 లక్షల మందికి ఉపాధి లభించింది. దీనికి తోడు వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ చిన్నచిన్న వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద మార్ట్‌ల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. దీంతో లక్షలాది మంది మహిళలు తాము జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అలాగే క్యాంపస్‌ ఉద్యోగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది.

ఆ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా విద్యార్థులకు తగిన శిక్షణ అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు 1.2 లక్షల మందికి క్యాంపస్‌ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

టీడీపీ పాలనలో ఉపాధి కల్పన శూన్యం..
గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ ఉద్యో­గాల భర్తీని అసలు పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ఏజెన్సీల నియామకంపైనే దృష్టి సారించింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల ఉద్యోగాలనే భర్తీ చేశారు. దీంతో ఆయన హయాంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణా­ల్లోని నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వె­య్యి మందికి 45 మంది నిరుద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

మరిన్ని వార్తలు