Sakshi News home page

తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

Published Fri, Dec 1 2023 8:03 AM

Reduced Unemployment Rate - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్‌–జూన్‌లో 6.6 శాతంగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్‌–డిసెంబర్‌ 9.6 శాతం నమోదైంది. 

పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్‌–డిసెంబర్‌లో 6.5 శాతంగా 
నమోదైంది.

క్రియాశీల శ్రామిక శక్తి..
2023 జూలై–సెప్టెంబర్‌లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది.  ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్‌–జూన్‌లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్‌–డిసెంబర్‌లో 48.2 శాతం నమోదైంది.

Advertisement

What’s your opinion

Advertisement