హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

3 Mar, 2021 18:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తామందరమూ ఊహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలు అధికంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఫలితాలు వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉంటాయని తెలిసే చంద్రబాబు కోవిడ్ చూపి ఎన్నికలను వాయిదా వేయించాడన్నారు. 

ఎస్‌ఈసీ విషయంలో చంద్రబాబు రోజుకో తీరులో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రోజు మెరునగధీరుడు అన్నారు.. ఇప్పుడేమో ఎస్‌ఈసీ మారిపోయాడంటున్నాడన్నారు. వలంటీర్ల సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్‌ఈసీ కుట్రలు పన్నినప్పటికీ, కోర్ట్ ఆ కేసును కొట్టేసిందని గర్తుచేశారు. ఎస్‌ఈసీ అధికార దుర్వినియోగం చేసి మళ్లీ నామినేషన్ వేయండని టీడీపీ వారిని కోరినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ పార్టీపై నమ్మకం పోయింది కాబట్టే నామినేషన్‌ వేసే నాధుడే కరువయ్యాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అంత చెండాలం లేదనుకుంటే, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందని, దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 

2014 మున్సిపల్ మేనిఫెస్టోలో 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆతరువాత ఆ ఊసే లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అధికారమే లేకుంటే  మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు