మరిన్ని స్కూళ్లు ‘డిజిటల్‌’

18 Oct, 2023 03:28 IST|Sakshi

హైస్కూళ్లకు మరో  32 వేల ఐఎఫ్‌పీలు 

ప్రాథమిక పాఠశాలలకు 23 వేల స్మార్ట్‌ టీవీలు 

డిసెంబర్‌నాటికి అన్ని స్కూళ్లకు సరఫరా 

ఇప్పటికే 30 వేల ఐఎఫ్‌పీలు, 10 వేల స్మార్ట్‌ టీవీలతో బోధన 

మంచి ఫలితాలు ఇస్తున్న  డిజిటల్‌ బోధన 

దేశంలోనే అతి పెద్ద డిజిటల్‌ ప్లాట్‌ఫారంగా పాఠశాల విద్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ అత్యున్నత స్థాయి విద్య అందించాలని, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు తెచ్చారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్‌ స్కూళ్లలో మాదిరిగా అత్యాధునిక పద్ధతుల్లో బోధన, వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. ఇందుకోసం గత నాలుగున్నరేళ్లలో రూ. 66 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.

‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణంతోపాటు అత్యాధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీలు) ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్‌ నాటికి అన్ని ఉన్నత పాఠశాలల్లో మరో 32 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 23 వేల స్మార్ట్‌ టీవీలు అందించనున్నారు.
 
సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బోధనను ఈ (2023–24) విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పాఠశాల విద్యను దేశంలోనే అతి పెద్ద డిజిటల్‌ ప్లాట్‌ఫారంగా మారుస్తోంది. తొలివిడత నాడు–నేడులో ఆధునీకరించిన పాఠశాలల్లో నూతన తరగతి గదులు, డబుల్‌ డెస్క్‌ బెంచీలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలతో పాటు కార్పొరేట్‌ పిల్లలకు మాత్రమే సాధ్యమైన బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  ఉచితంగా అందించింది.

అనంతరం అమెరికా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే విద్యా బోధనకు వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ గల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్ల ను, స్మార్ట్‌ టీవీలను 11,315 పాఠశాలల్లో ఈ ఏడాది జూన్‌ నెలలోనే అందుబాటులోకి తెచ్చింది. 4,800 ఉన్నత పాఠశాలల్లో 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను ఏర్పాటు చేయగా, 6,515 ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ డిసెంబరు మొదటి వారానికి మరో 32 వేల ఐఎఫ్‌పీలను హైస్కూళ్లకు అందించనుంది. గతంలో పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్‌పీలనే ఇప్పుడూ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు అధికారులు టెండర్‌ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసే 23 వేల స్మార్ట్‌ టీవీల టెండర్ల జ్యుడిíÙయల్‌ ప్రివ్యూ పూర్తయింది.

ఈ టెండర్లను ఖరారు చేసి వచ్చే నెలలోనే స్మార్ట్‌ టీవీల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనుంది. ఈ ఏడాది టోఫెల్‌ కూడా ప్రవేశపెట్టడం, స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా బోధన వల్ల కలిగే మంచి ఫలితాలు ఇటీవల ముగిసిన ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ 1, 2 పరీక్షల్లో కనపడటంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఐఎఫ్‌పీలతో అత్యాధునిక పద్ధతిలో బోధన 
ఐఎఫ్‌పీలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తాయి. 165 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై  ఓ పక్క వీడియోలో బోధన చేస్తూనే.., మరోపక్క విద్యారి్థకి అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి చూపించవచ్చు. అవసరమనుకుంటే అదే అంశాన్ని ప్రింట్‌ తీసుకోవచ్చు. మొత్తం పాఠాన్ని లింక్‌ రూపంలో ఆన్‌లైన్‌లో పెట్టొచ్చు. అంటే ఒకే బోర్డుపై అనేక విధాలుగా బోధన (మల్టీ టాస్కింగ్‌) చేయొచ్చు.

ఈ ఐఎఫ్‌పీ ప్యానెళ్లలో పాఠ్యాంశాలు, బైజూస్‌ కంటెంట్‌ను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో అందిస్తారు. గూగుల్‌ అసిస్టెంట్‌తో వచ్చే ఈ ఇంటరాక్టివ్‌ స్మార్ట్‌ ప్యానెళ్లు 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడత ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు గుర్తించారు.

మరిన్ని వార్తలు