పాపను బాగా చూసుకోండి.. 4 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి..

16 Aug, 2023 10:12 IST|Sakshi

ఏలూరు: విజయవాడ రూరల్‌ మండలం నున్న  గ్రామ సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పని చేస్తున్న గుణదల శిరీష(30) భర్త వేధింపులు తాళలేక  సోమవారం అర్ధరాత్రి నూజివీడులోని తన పుట్టింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణదల శిరీషకు ఎన్టీఆర్‌ జిల్లా  విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి నిత్యం అనుమానంతో శిరీషను వేధించేవాడు.

 ఆ తరువాత కొంతకాలానికి పాప పుట్టింది. 2019 నవంబరులో నున్న సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో నున్నలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు సర్దిచెప్పి కాపురానికి పంపించేవారు.అయితే మూడు రోజుల క్రితం తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. దీంతో శిరీష నూజివీడులోని తన పుట్టింటికి వచ్చింది. తరువాత తన అన్నను పాపను తీసుకురమ్మని పంపగా వారు పంపలేదు. దీంతో చేసేదేమీ లేక తాను చనిపోయిన తర్వాత పాపను బాగా చూసుకోవాలని తన అన్నను కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది.

 తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్‌లో పేర్కొంది.  మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె అన్న ఆమె గదిలోకి వెళ్లగా ఉరివేసుకుని ఉండడంతో వెంటనే అందరిని పిలిచి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివనారాయణ బాపూనగర్‌లోని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌గౌడ్‌ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. సూసైడ్‌ లేఖ ఆధారంగా, మృతురాలి అన్న గుణదల కాశీ విశ్వనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు