సంబరం.. అంబరం

16 Aug, 2022 11:01 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ప్రతి హృదయమూ పులకించింది. దేశభక్తితో ఉప్పొంగిపోయింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన సందర్భంగా పుట్టపర్తి ‘శిరసాని హిల్స్‌’ పరేడ్‌ మైదానం వందేమాతర నినాదాలతో హోరెత్తింది. శ్రీసత్యసాయి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. చిన్నారులంతా త్రివర్ణపతాకం చేబూని దేశ భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వేదికపైన ఉన్న జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గుమ్మనూరు సహా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సుమారు గంట పాటు మైమరచిపోయి ప్రదర్శనలను వీక్షించారు.

కార్యక్రమంలో  గోరంట్లకు చెందిన ఉదయ్‌కిరణ్‌ పాఠశాల, శ్రీకృష్ణదేవరాయ జూనియర్‌ కళాశాల, వివేకానంద పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ఎస్‌డీజీఎస్‌ కళాశాల హిందూపురం, కేజీబీవీ బుక్కపట్నం, గురుకుల పాఠశాల కొడిగిన హళ్లి, మోడల్‌స్కూల్‌ పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ తదితర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మా తుజే సలాం, జయహో.., దేశ్‌ మేరా రంగీలా.., ఎత్తర జెండా, పోరాట యోధుల త్యాగాలు.., దేశం మనదే..,వందేమాతరం.., మేమే ఇండియన్స్‌ తదితర పాటలతో హోరెత్తించారు. పిరమిడ్‌ యోగా విన్యాసాలు, ఆదివాసీ గిరిజన నృత్యాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు.   

మరిన్ని వార్తలు