నిజం నిగ్గు తేలాల్సిందే

13 Sep, 2020 03:12 IST|Sakshi
చంద్రబాబు అధికారంలో ఉండగా 2017లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కె.పెంటపాడు గ్రామంలో దగ్ధమైన చారిత్రక గోపాలస్వామి ఆలయ రథం (ఫైల్‌)

2017లో గోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైతే స్పందించని అప్పటి ప్రభుత్వం

అప్పటి దేవదాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఘటన

స్థానికుల చందాలతో కొత్త రథం తయారీ

2018లో విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు

గర్భగుడిలో అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి  తిరిగినట్టు సీసీ కెమెరాలోనూ నమోదు

ఆయా ఘటనలపై నోరు మెదపని టీడీపీ, జనసేన, బీజేపీ

ఇప్పుడు అంతర్వేది ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలా స్పందించినా రాజకీయం చేస్తున్న వైనం

ఈ నేపథ్యంలో 2014–19 మధ్య ఆలయాల్లో చోటు చేసుకున్న ఘటనలపై సర్కారు ఆరా

ఆయా ఘటనలపై విచారణ జరిపించి వాస్తవాలు భక్తులకు వివరించే యోచన

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ రెండు ఘటనల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్పందించనే లేదు. అయితే నిన్నటి అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెనువెంటనే పలు నిర్ణయాలు తీసుకుంది. కానీ, కొన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనకు రాజకీయ రంగు పూసి లబ్ధి పొందాలని చూస్తున్నాయా? అన్న ప్రశ్నకు పలువురి నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తోంది.

సాక్షి, అమరావతి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి, వేగంగా దర్యాప్తు చేయించడంతో పాటు కొత్త రథం తయారీకి నిధులు కేటాయించినప్పటికీ కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న రాజకీయంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయని అధికార వర్గాలు, భక్తుల్లో సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజు నుంచి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్నది నిగ్గు తేల్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

అప్పటి ఘటనలపై వివరాల సేకరణ
► 2017 అక్టోబర్‌ 19న కె.పెంటపాడు గ్రామంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆలయ రథం దగ్ధమైనప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పని చేయలేదు. పగటి పూట ఘటన జరిగినా.. తాడేపల్లి గూడెం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా ఆ రథం పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు అప్పడు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.ఎన్‌.వీ.డీ.వీ ప్రసాద్‌ శుక్రవారం దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదికను అందజేశారు.
► ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం సరైన విచారణ జరపలేదు. కొత్త రథం నిర్మాణానికీ చర్యలు తీసుకోలేదు. స్థానికంగా ఉండే భక్తులే రూ.24 లక్షలు చందాలు వసూలు చేసి, కొత్త రథం తయారు చేయించారు.
► విజయవాడ దుర్గ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో తాంత్రిక పూజలతో పాటు 2014–19 మధ్య దేవదాయ శాఖ పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో చోటు చేసుకున్న వివిధ రకాల ఘటనలపై ఈవోల ద్వారా దేవదాయ శాఖ కమిషనర్‌ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయా ఘటనలన్నింటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. 

ఎవరిది అవకాశవాదం?
► టీడీపీ ప్రభుత్వంలో పగటి పూట ఆలయ రథం దగ్ధమైతే ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనపై ఈ ప్రభుత్వం ఆలయ ఈవో సస్పెన్షన్‌తో పాటు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. 
► గత ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ 2017లో జరిగిన కె.పెంటపాడు ఆలయ రథం దగ్ధం ఘటన, 2018లో దుర్గ గుడిలో తాంత్రిక పూజలు, ఇతరత్రా ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఏ ఒక్కదానిపై ఒక్క మాటా మాట్లాడలేదు.
► పైగా ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మతాల మధ్య చిచ్చు రేపి ఓట్లు చీల్చాలని కుట్రలు చేస్తున్నది హిందూ నాయకులే అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 
► 2017లో అప్పటి దేవదాయ శాఖ మంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘటన చోటు చేసుకుంది. ఆ మంత్రి బీజేపీ నేత. అప్పట్లో ఆ ఘటనపై అప్పటి బీజేపీ పెద్దలు కూడా నోరు విప్పలేదు. నాడు టీడీపీ,  జనసేన, బీజేపీ నేతల తీరు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ప్రజలకు వివరించి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మరిన్ని వార్తలు