సాగు, తాగునీటి అవసరాలకే శ్రీశైలం

5 Aug, 2022 04:26 IST|Sakshi

జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండాల్సిందే

అప్పుడే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరివ్వగలుగుతాం

కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీకి తేల్చిచెప్పిన ఏపీ

కనీస నీటిమట్టం 834 అడుగులేనన్న తెలంగాణ.. తోసిపుచ్చిన ఆర్‌ఎంసీ

శ్రీశైలం విద్యుత్‌లో 66 శాతం ఇవ్వాలని ఏపీ పట్టు

మళ్లించే వరద జలాలను వాటాలో కలపకూడదన్న ఏపీ

ఏకాభిప్రాయం కుదిరిన అంశాలపై బోర్డుకు నివేదిక

ఈ నెల మూడో వారంలో మళ్లీ ఆర్‌ఎంసీ భేటీ

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో సాగు, తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)కి ఆంధ్రప్రదేశ్‌ తేల్చి చెప్పింది. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని స్పష్టంచేసింది. శ్రీశైలం జల విద్యుత్‌ కోసం నిర్మించిన ప్రాజెక్టు అని, కనీస నీటిమట్టం 834 అడుగులేనని తెలంగాణ చెప్పింది. తెలంగాణ వాదనను ఆర్‌ఎంసీ కన్వీనర్, కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై తోసిపుచ్చారు. శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించిందని గుర్తు చేశారు.

గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్కే పిళ్లై అధ్యక్షతన ఆర్‌ఎంసీ సమావేశమైంది. బోర్డు సభ్యులు ముయన్‌తంగ్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ నియమావళి (రూల్‌ కర్వ్‌), జలవిద్యుత్‌ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించగలమని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పారు.

జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 వరకూ కాకుండా.. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకూ 854 అడుగుల్లో నీరు ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. నాగార్జున సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఈ లెక్కన శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతం, సాగర్‌ విద్యుత్‌లో 50 శాతం ఇవ్వాలని ఏపీ ఈఎన్‌సీ డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉత్పత్తయ్యే విద్యుత్‌ చెరి సగం పంచుకునేలా ఆదిలోనే అంగీకారం కుదిరిందన్నారు. దీనికి అంగీకరించే ప్రశ్నే లేదని, తాము కోరిన వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ ఈఎన్‌సీ పట్టుబట్టారు. శ్రీశైలానికి దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు ఎవరి వాటా జలాలను వారు విడుదల చేస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు.

వరద జలాలపై ఏకాభిప్రాయం
జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని ప్రాజెక్టులు నిండి, సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్న సమయంలో మళ్లించే వరద జలాలను వాటా (నికర జలాలు)లో కలపకూడదని ఏపీ ఈఎన్‌సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ మాట్లాడుతూ.. మళ్లించిన వరద జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఏపీకి ఎక్కువగా ఉన్నందున, వాటిలో వాటా ఇవ్వాలని కోరారు. ముంపు ముప్పును నివారించడానికే వరద జలాలను మళ్లిస్తున్నామని, బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉందని ఏపీ ఈఎన్‌సీ స్పష్టం చేశారు.

ఆర్కే పిళ్లై జోక్యం చేసుకుంటూ.. మళ్లించే వరద జలాలను లెక్కిస్తామని, కానీ వాటిని వాటాలో కలపబోమని స్పష్టం చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈనెల మూడో వారంలో మళ్లీ ఆర్‌ఎంసీ సమావేశం నిర్వహిస్తామని పిళ్లై చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన అంశాలపై బోర్డుకు నివేదిక ఇస్తామన్నారు.  

మరిన్ని వార్తలు